‘అధికారంలోకి వస్తే.. విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం’

1 Jan, 2022 17:23 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ దూకుడు పెంచారు. అందులో భాగంగానే సామాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత కరెంట్‌ అందిస్తామరని తెలిపారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల డొమెస్టిక్‌ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు.

ఇప్పటికే రైతులకు వ్యవసాయంలో ఇబ్బంది కలగకుండా ఉచితం విద్యుత్‌ అదిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలవలేదని, అది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు.

వలస కార్మికులు వందల కీలోమీటర్లు రోడ్లపై నడుస్తూ రాష్ట్రానికి చేరుకున్నారని, వారికి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులను నమోదు చేస్తోందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణో‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అఖిలేష్‌ యాదవ్‌ సంతాపం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు