Akhilesh Yadav: ‘2022లో ఎన్నికలు కాదు... ప్రజాస్వామ్య విప్లవం చూస్తాం’

30 Jun, 2021 15:45 IST|Sakshi

లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విప్లవం చూడబోతున్నామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. దిగజారుడు, ప్రజా వ్యతిరేక రాజకీయాలు చేసే వారికి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘‘విభజన, సంప్రదాయ, విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా.. నిర్లక్ష్యం గావించబడిన, అణచివేతకు గురైన, అమానుషాలకు బలైన, దళిత, పీడిత, పేద, రైతు, కార్మిక వర్గం.. మహిళలు, యువత ఐకమత్యంగా నిలబడుతుంది. కొత్త ఊపిరిలూదుతుంది’’ అని భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. 

అదే విధంగా... రానున్నవి అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే ​కావని, రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోయే ప్రజాస్వామ్య విప్లవానికి నాంది అని అఖిలేశ్‌ అభిప్రాయపడ్డారు. ఇక శాసన సభ ఎన్నికల్లో(2022) తమ పార్టీ.. 403 అసెంబ్లీ స్థానాలకు గానూ 350పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఒక్కటై వారికి మేలు చేసే పార్టీకే విజయం చేకూరుస్తారని పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతూ అఖిలేశ్‌ యాదవ్‌ దూకుడు పెంచారు.

చదవండి: ఠాక్రే, మోదీ భేటీ.. ‘రాజకీయాలు వేరుగా ఉంటాయి’

>
మరిన్ని వార్తలు