నిజామాబాద్‌ అర్బన్‌లో బీఆర్‌ఎస్‌ హడావుడి.. కవిత సైతం అక్కడి నుంచే పోటీ!

20 Mar, 2023 11:00 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: సిట్టింగులకే మరోసారి టికెట్లు అని సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్టు దక్కించుకునేందుకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆకుల లలిత తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొన్ని నెలలుగా నగరంలో విస్తృతంగా తిరుగుతున్నారు. మొదట తన సామాజికవర్గమైన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మున్నూరుకాపు మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తూ, మరోవైపు వివాహాలకు, పరామర్శలకు వెళ్తూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్‌ పుట్టినరోజు, కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా అడుగడుగునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పార్టీ నాయకత్వం తనకు అర్బన్‌ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినట్లు లలిత చెబుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ తిరిగేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో మైనారిటీల తర్వాత అత్యధికంగా ఉన్నది మున్నూరుకాపు ఓట్లే కావడంతో ఈ కోటాలో తనకు కచ్చితంగా టిక్కెట్‌ దక్కుతుందని లలిత భావిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

అనేక మలుపులు.
పూర్తి డైనమిక్‌గా ఉండే రాజకీయాల్లో ఆకుల లలిత రాజకీయ జీవితం ఇటీవల కాలంలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. తనకు తృటిలో ఎమ్మెల్సీ టికెట్‌ జారిపోవడంతో నామినేటెడ్‌ పోస్టుతో సరిపెట్టుకున్నారు. ఈ ప్రొటోకాల్‌తో నగరంలో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో అర్బన్‌ టికెట్‌ రేసులో ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నారు. 2008 ఉపఎన్నికల్లో డిచ్‌పల్లి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన లలిత 2009లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2016లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు మూడు రోజుల ముందే బీఆర్‌ఎస్‌తో అంతర్గత ఒప్పందం చేసుకుని అస్త్రసన్యాసం చేసినట్లు రాజకీయ వర్గాలతో పాటు ఇతర అన్నివర్గాలు కోడై కూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే బీఆర్‌ఎస్‌లో చేరారు.

మరోసారి ఎమ్మెల్సీ పదవి కొనసాగింపు కోసం కేసీఆర్‌ నుంచి హామీ తీసుకుని తన వియ్యంకుడు నేతి విద్యాసాగర్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్సీ అవకాశం మరోసారి దక్కలేదు. ఎంపీగా ఓటమిపాలైన కేసీఆర్‌ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో లలితకు నిరాశే మిగిలింది. చివరకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం కవిత మహిళా బిల్లు కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న నేపథ్యంలో మహిళా కోటా, మున్నూరుకాపు కోటాలో అర్బన్‌ టికెట్‌ కోసం ఆశలు పెట్టుకుని నగరంలో తిరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.

అయితే కవిత కూడా అర్బన్‌ నుంచి పోటీ చేయవచ్చనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో లలితకు మరోసారి కవిత రూపంలో అడ్డంకి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా 2018 ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఆకుల లలిత పోటీ చేసినప్పుడు ఆమె వెంట తిరిగిన క్యాడర్‌ను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇబ్బందులు పెట్టడంతో, ఈసారి లలిత ఎక్కడ పోటీ చేసినా వ్యతిరేకంగా పనిచేస్తామని సదరు నాయకులు, కార్యకర్తలు చెబుతుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు