‘ప్రజాసంగ్రామ యాత్ర’ .. బీజేపీలోకి చల్లా వెంకట్రామ్‌రెడ్డి!

20 Apr, 2022 13:07 IST|Sakshi

మరో మాజీ మంత్రి జూపల్లి, ఇతర నేతలు కూడా!!

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజాసంగ్రామ యాత్ర’ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్‌రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా జిల్లా ముఖ్యనేతలతోపాటు సంజయ్‌ తరఫు ప్రతినిధులు జరిపిన చర్చలకు వెంకట్రామ్‌రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కుమార్తె కుమారుడు) వెంకట్రామ్‌కు ఆలంపూర్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచిపట్టు ఉంది.

ఇప్పుడు ఆయన వనపర్తి నుంచి పోటీచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వెంకట్రామ్‌తోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరికొందరు నేతలు కూడా సంజయ్‌ పాదయాత్ర ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో లేదా మే 14న జరిగే ముగింపు సమావేశానికి అమిత్‌ షా వస్తున్న నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు