చర్చనీయాంశంగా మారిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి చేరిక

20 Jul, 2022 13:41 IST|Sakshi

సొంతగూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి

హుస్నాబాద్‌ టికెట్‌ ఖాయంతో కాంగ్రెస్‌ తీర్థం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: హుస్నాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నేత అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆ పార్టీని వీడి.. ఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

2019లో గులాబీ తీర్థం
అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జాతీయ స్థాయిలో పేరున్న ముల్కనూర్‌ రైతు సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు.. ఆ ఎన్నికల్లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో విజయం సునాయాసంగా వరించింది. వైఎస్సార్‌ మరణం తదనంతర పరిణామాల్లో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కాగా.. అతనితో సన్నిహిత సంబంధాలున్న ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు సాధించగలిగారు.

2014 ఎన్నికల్లో వొడితెల సతీశ్‌కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో సైతం టికెట్‌ ఇస్తామనడంతో నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. చివరి నిమిషంలో పొత్తుల్లో భాగంగా వ్యూహాత్మకంగా సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి హుస్నాబాద్‌ టికెట్‌ దక్కించుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్‌రెడ్డి కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటూ.. 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. 


టికెట్‌ పక్కాతోనే..

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హస్నాబాద్‌ నుంచి 2014 ఎన్నికల్లో ఓటమి చెందగా.. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ చేజారింది. వరుసగా రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వొడితెల సతీశ్‌కుమార్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రవీణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ.. హుస్నాబాద్‌ నుంచి టికెట్‌ లభించే అవకాశం లేదు. ఈటల రాజేందర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ తదనంతరం వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే ఎన్నికల్లో(2023) వొడితెల సతీశ్‌కుమార్‌ను అక్కడి నుంచి బరిలోకి దింపుతారన్న వార్తలొచ్చాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో హుస్నాబాద్‌ టికెట్‌ సతీశ్‌కుమార్‌కే పక్కా అన్న చర్చ జోరందుకోవడంతో ఇక్కడ చాన్స్‌ లేదని భావించిన ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు సైతం సంప్రదింపులు జరిపారన్న ప్రచారం ఉన్నా.. టార్గెట్‌–2023 లక్ష్యంగా హుస్నాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న అల్గిరెడ్డి.. టికెట్‌ పక్కా చేసుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. (క్లిక్‌: మళ్లీ ‘షేక్‌హ్యాండ్‌’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు)

మరిన్ని వార్తలు