దుబ్బాక ఉప ఎన్నిక: యువతకు గాలం

17 Oct, 2020 08:50 IST|Sakshi

దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. పార్టీ బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో సందడి చేయాలంటే యువత పాత్ర కీలకం. వయసు మళ్లిన వారి ఓటింగ్‌ సైలెంట్‌గా జరగుతుందని గమనించిన నాయకులు యువకులను ఆకర్షించే పనిలో పడ్డారు. వీరిని మచ్చిక చేసుకుంటే.. ఈ నాలుగు రోజులు ప్రచారానికి పనికి రావడంతోపాటు ఓట్లు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో యువకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తాయిలాలు ప్రకటిస్తున్నారు. 

సాక్షి, సిద్దిపేట: నియోజకవర్గంలో 18 నుంచి 25 ఏళ్ల  వయస్సు ఉన్న యువతీ, యువకులు 10 శాతం మంది ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 20 వేల మేరకు యువత ఓట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటు పొందిన వారు 5 వేల మేరకు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులతో పాటు, వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు. ఇలా మొత్తం ఓటర్లు, యువకులు, యువతులతోపాటు, వారు చేసే పనులను ఆధారంగా విభజించి వారి అవసరాలను గుర్తించి హామీలుస్తూ దగ్గరకు చేర్చుకుంటున్నారు. 

ఎటు మొగ్గు చూపుతారో..  
టీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవల దౌల్తాబాద్‌లో రెండు వేల మంది యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పార్టీ అనుబంధ  తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులను నియోజకవర్గంలో తిప్పి యువతను గ్యాదర్‌ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి, యువజన సంఘాల సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారికి కావాల్సిన ఆటవస్తువులు, కిట్లు, జిమ్ములు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఆకర్షిస్తున్నారు. అయితే యువతే ఆధారంగా బీజేపీ ప్రచారం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా బీజేపీ అనుబంధ ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదల్, మహిళా మోర్చ ఇలాంటి సంఘాల్లోని యువతను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ క్యాడర్‌ను పెంచుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నియోజకవర్గంలోని యువతే కాకుండా ప్రచారం కోసం జిల్లా  వ్యాప్తంగా ఉన్న యువకులను సైతం నియోజకవర్గానికి పిలిపించుకొని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. లాక్‌ డౌన్‌తో కళాశాలలు ఇంకా తెరవకపోవడం, ఇతర పనులు కూడా లేకపోవడంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న వారిలో యువత ఎక్కువగా కన్పిస్తోంది. అయితే పోలింగ్‌ నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో.. యువత ఓట్లు ఎటు మొగ్గుచూపుతాయో వేచి చూడాల్సి ఉంది. 

46 మంది అభ్యర్థులు.. 103 నామినేషన్లు
దుబ్బాకటౌన్‌: దుబ్బాక ఉప ఎన్నికల్లో  నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది.  9 వ తేదీ నుంచి నేటి వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. చివరిరోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 
దాఖలు చేసిన అభ్యర్థులు.. 
సోలిపేట సుజాత(టీఆర్‌ఎస్‌), మాధవనేని రఘునందన్‌రావు(బీజేపీ), చెరుకు శ్రీనివాసురెడ్డి(కాంగ్రెస్‌),  కత్తి కార్తీక బీఆర్‌ఎం(ఆల్‌ ఇండియా ఫార్వర్డు బ్లాక్‌), గౌటి మల్లేశ్‌ ( జై స్వరాజ్‌), లొంగరి రమేశ్‌ (బహుజన రాష్ట్ర సమితి), సుకూరి అశోక్‌( రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), మైసంగారి సునీల్‌(ఇండియన్‌ ప్రజాబంధు) సుదర్శన్‌ ఆడెపు (శివసేన), జాజుల భాస్కర్‌ (శ్రమజీవి పార్టీ), ఎం.జగదీష్‌ రరాజ్‌ (ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌), వడ్ల శ్యాం ( అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌), చెరుకు విజయలక్ష్మి (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌), జై.భరసింహరాయుడు (తెలంగాణ జగ్‌ హీర్‌), ఇండిపెండెంట్లుగా బుర్ర రవితేజ, రేవు చిన్న ధన్‌రాజ్, శ్రీకాంత్‌ సిలివేరు, మోతె నరేష్, మీసాల రాజాసాగర్, కోట శ్యాంకుమార్, షేక్‌ సర్వర్‌ హుస్సెన్, పెద్దలింగన్నగారి ప్రసాద్, పోసానిపల్లి మహిపాల్‌రెడ్డి, దొడ్ల వెంకటేశం, కొల్కూరి ప్రసాద్, అడ్ల కుమార్, గొంది భుజంగం, కొట్టాల యాదగిరి, జక్కుల నర్సింలు, మద్దెల నర్సింలు, పెద్దమ్యాతరి బాబు, వడ్ల మాధవచారి, వర్కోలు శ్రీనివాసు, ఉడుత మల్లేశం, కంటె సాయన్న, రణవేని లక్ష్మణ్, బుట్టంగారి మాధవరెడ్డి, వేముల విక్రంరెడ్డి, రేపల్లి శ్రీనివాసు, పెంటం మల్లికార్జున్, పిడిశెట్టి రాజు, బండారు నాగరాజు, కొల్లూరు జగన్మోహన్‌రావు ముదిరాజ్, జక్కుల రాధారమణి, అల్వాల కృష్ణస్వామి, డి.కిషన్‌రావు లు నామినేషన్లు దాఖలు చేశారు.   

ఉపఎన్నిక టీఆర్‌ఎస్‌కు గుణపాఠం కావాలి 
మిరుదొడ్డి(దుబ్బాక): దుబ్బాక ఉపఎన్నికలో ఓటర్లు ఇచ్చే తీర్పుతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక గుణపాఠం కావాలని మాజీ మంత్రి, ప్రముఖ హాస్య సినీనటుడు బాబూమోహన్‌ అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం విశ్వకర్మ కర్మ సంఘం సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు బాబూమోహన్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తలబిరుసుతో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు. వజ్రాయుధం కంటే విలువైన ఓటును సందించి బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. బీజేపీకి జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. 

అవినీతి డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు 
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్‌ అవినీతి డబ్బులతో ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి పల్లి బాబూమోహన్‌ ఆరోపించారు. మండల కేంద్రమైన తొగుటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారికి టీఆర్‌ఎస్‌లో గౌరవంలేదన్నారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన రఘునందన్‌రావు లాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ది రఘునందన్‌రావును గెలిపించాలని ప్రజలను కోరారు. 

లక్ష ఓట్లు లక్ష్యంగా యువత కృషి చేయాలి
తొగుట(దుబ్బాక): దుబ్బాక ఉప ఎన్నికలో యువత కీలకంగా వ్యవహరించాలని తొగుట ఇన్‌చార్జి, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. మండలంలోని కాన్గల్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ యువత, విద్యార్థి విభాగం ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలిపేట సుజాతమ్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడుమెరుగు మహేష్, మండల అద్యక్షుడు అనిల్‌ కుమార్, సోషల్‌ మీడియా మండల కో–ఆర్డినేటర్‌ బండారు రమేష్‌ గౌడ్, నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, నరేష్, కుమార్, మహేష్, ఆబిద్, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు