బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు

30 Jun, 2021 03:41 IST|Sakshi

ఆయన రోజురోజుకీ దిగజారిపోతున్నారు

బాబు లాగా సీఎం జగన్‌ దొంగ దీక్షలు చేయలేదు

మూడు గంటల దీక్షతో చంద్రబాబు సాధించింది ఏంటి?

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదని.. ఆయన రోజురోజుకీ దిగజారిపోతున్నారని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దుయ్యబట్టారు.  మంగళవారం ఆయన చేపట్టిన 3 గంటల దీక్షతో ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబులా సీఎం జగన్‌ ఎప్పుడూ దొంగ దీక్షలు చేయలేదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే బాబు పరిమితమయ్యారని.. అధికారంలో ఉన్నప్పుడు నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజలను నయవంచన చేశారని విమర్శించారు. సాధారణంగా ఎవరైనా దీక్ష చేస్తే షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయని.. కానీ, బాబుకు పెరుగుతూనే ఉంటాయని ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తిని దీక్షకు కూర్చున్నారు.. ఆ తర్వాత అది అరిగే వరకు సీఎంను విమర్శించారని వ్యాఖ్యానించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

కరోనా నియంత్రణలో ఏపీ ఆదర్శం
రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్స్‌ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రధాని ప్రశంసలు బాబుకు కనిపించవా? మూడో దశ కరోనాపై ఇప్పటికే సీఎం జగన్‌ అందరినీ సన్నద్ధం చేశారు. ఏపీలో కరోనాతో కేవలం 12,700 మాత్రమే మృతిచెందడంపై చంద్రబాబు నిరాశ చెందుతున్నట్లుగా ఉంది. ప్రజలు కష్టాల్లో ఉంటే బాబు, లోకేష్‌లు హైదరాబాద్‌లో దాక్కుని రాష్ట్రంపై రాళ్లు వేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. 

రాధాకృష్ణ రాతలు దారుణం
బాధ్యత గల పత్రికాధినేత రాధాకృష్ణ తన వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం జగన్‌ను ఏదో విధంగా గద్దె దించి చంద్రబాబును సీఎం చేయాలన్న ఆలోచనతో సీఎంని చులకన చేస్తూ రాధాకృష్ణ దారుణమైన కల్పిత, నీచమైన తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆయన ప్రతీరోజూ రాత్రి దెయ్యాలు, భూతాలు, రాక్షస మనస్తత్వం ఉన్న చంద్రబాబుతో చర్చిస్తారేమో.. అందుకే ఆ ప్రభావంతో జుగుప్సాకర రాతలు రాస్తున్నారు. కరోనాపై సీఎంతో జరిగే సమీక్షల్లో తనతోపాటు ఎంతోమంది అధికారులు, మంత్రులు పాల్గొంటారు. రాధాకృష్ణ రాసిన వ్యాఖ్యలను సీఎం జగన్‌ ఎప్పుడూ అనలేదు. 

ప్రజల ప్రాణాలతో బాబు చెలగాటం..
చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారు. బాబు హయాంలో ఎవరికీ రూ.5 లక్షలకు మించి పరిహారం ఇవ్వలేదు. అదే సీఎం జగన్‌ ఎల్జీ పాలిమర్స్‌ బాధితులకు రూ. కోటి పరిహారం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో ఓ డాక్టర్‌ వైద్యానికి అవసరమయ్యే రూ.1.50 కోట్లను సీఎం జగన్‌ మంజూరు చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్‌ చేసే హక్కు చంద్రబాబుకు లేదు. గోదావరి పుష్కరాల్లో 29మంది చనిపోతే ఆయనేం చేశారు? కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 130 టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే అవసరమవుతోంది. అలాగే, వాటిల్లో 75 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనాతో చనిపోయిన వారి వివరాలను పబ్లిక్‌ డొమైన్లో పెట్టాం.. చంద్రబాబు వాటిని చూసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు