చంద్రబాబుకు కనిపించని అభివృద్ధి, సంక్షేమం

1 Oct, 2020 04:06 IST|Sakshi

ఆయన అసత్యాలను ఆ రెండు పత్రికలు ప్రచారం చేస్తున్నాయి

బాబు అడుగులకు మడుగులొత్తొద్దు

వాస్తవాలు వివరిస్తూ ప్రకటనలిచ్చినా వేయరా?

ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న కోవిడ్‌ నియంత్రణ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తుంటే చంద్రబాబుకు అవి కనిపించడంలేదని.. పైగా వాటిని వ్యతిరేకిస్తూ అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. అలాంటి చంద్రబాబు అడుగులకు ఆ రెండు పత్రికలు మడుగులొత్తుతున్నాయని.. ఇది దారుణమని ఆయనన్నారు. రోజుకు 70వేల టెస్టులు చేస్తున్నది బాబుకు తెలియదా.. వాస్తవాలను ప్రభుత్వం ప్రకటనల రూపంలో ఇచ్చినా వేయడం లేదంటే అవి ఎంతగా దిగజారాయో.. వాటి నైజం ఏమిటో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► రాష్ట్రంలో రోజుకో కుట్రకు తెరలేపుతూ చంద్రబాబు ప్రకటనలు చేయడం.. వాటిని ఈ పత్రికలు పతాక శీర్షికల్లో రాయడం సరైనది కాదు.
► చంద్రబాబు కోవిడ్‌ సమయంలో ఏ ఒక్క ఆస్పత్రినైనా సందర్శించారా? హైదరాబాద్‌ నుంచి జూమ్‌లో విమర్శలు చేయడమేమిటి?
► ప్రజలకు మనోధైర్యం కల్పించే పని ఒక్కటైనా చేశారా?
► ఒక్క ల్యాబొరేటరీ లేని పరిస్థితి నుంచి 14 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు తెచ్చినది బాబుకు తెలీదా.. స్వయంగా ప్రధానే ఏపీ చేస్తున్న పనులను ప్రశంసించారు.
► ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు.
► ఆరోగ్యశ్రీ కింద బాబు పెట్టిన రూ.1,500 కోట్ల బకాయిలను చెల్లించాం.
► ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్యను పెంచాం.. కొత్తగా 16 వైద్య కళాశాలలను తెస్తున్నాం.. ఏజెన్సీల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయి. చంద్రబాబు అభద్రతా భావానికి లోనవుతున్నారు.  

మరిన్ని వార్తలు