తప్పుదోవ పట్టిస్తారా?

17 Mar, 2022 04:02 IST|Sakshi

ఇతర మరణాలనూ కల్తీ సారా మృతులంటారా?: ఆళ్ల నాని 

బ్రెయిన్‌ హెమరేజ్‌తో గుంటూరు ఆసుపత్రిలో వ్యక్తి మృతి 

సమస్యలేవీ లేకనే టీడీపీ శవ రాజకీయాలు: బుగ్గన, కన్నబాబు

సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో చనిపోయిన వారిని కల్తీ సారా మృతులంటూ సభను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్‌ (నాని) మండిపడ్డారు. ప్రతిపక్షం పదేపదే సభను అడ్డుకోవడంతో బుధవారం అసెంబ్లీలో ఈ  ప్రకటన చేశారు.  

ఇదీ వాస్తవం.. 
ఈ నెల 11న జంగారెడ్డిగూడెంలో వరదరాజులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఏలూరు అక్కడ నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే నేను 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడా. వరదరాజులు బ్రెయిన్‌ హెమరేజ్‌తో మెదడులో రక్తస్రావం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బాధితుడు మంగళవారం రాత్రి 7 గంటలకు చనిపోయాడు. ఇప్పటికే ఎంఎల్‌సీ ప్రాథమిక నివేదిక రాగా పూర్తి స్థాయి రిపోర్టు రావాల్సి ఉంది. ఈలోగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.  

లక్షణాలన్నీ ఒకేలా ఉండాలి కదా? 
అవి నిజంగా కల్తీ సారాకు సంబంధించిన మరణాలే అయితే ఒకే రకమైన లక్షణాలుండాలి కదా? జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారందరి లక్షణాలు ఒకేలా లేవు. కొందరు కిడ్నీ వ్యాధులతో మరణిస్తే మరికొందరు కాలేయ సంబంధ జబ్బులతో మరికొందరు గుండెపోటు వల్ల మృతి చెందారు.   

వినే ఓపికా లేదా?: బుగ్గన 
టీడీపీ సభ్యులు రోజూ రెండు మరణాలను పెంచుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. కనీసం అడిగిన ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా వారికి లేదని విమర్శించారు. 

అప్పుడు ఎందుకు వెళ్లలేదు?: కన్నబాబు 
రాష్ట్రంలో ఏ సమస్యలు కనపడకపోవడంతో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని ఎత్తుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రచార వ్యామోహంతో గోదావరి పుష్కరాల్లో 29మంది, ఏర్పేడులో ఇసుక మాఫియా 16మందిని చంపినప్పుడు పరామర్శించని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం జంగారెడ్డిగూడెం పరుగెత్తుకెళ్లారని చెప్పారు.  

మరిన్ని వార్తలు