బాబు, నారాయణలకు శిక్ష తప్పదు

17 Mar, 2021 03:55 IST|Sakshi

దళితుల భూములను అమ్మకూడదు, బదలాయించకూడదని చట్టంలో ఉంది

చట్టాలను అతిక్రమించి.. అసైన్డ్‌ భూములను కాజేశారు

తప్పు చేయకపోతే చంద్రబాబు సీఐడీ విచారణను ఎదుర్కోవాలి

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

మంగళగిరి: దళితులను భయపెట్టి, బెదిరించి వారి భూములను కాజేసిన చంద్రబాబు, నారాయణ అండ్‌కో, వారి బినామీలకు శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడారు. అన్ని ఆధారాలతోనే తాను ఫిర్యాదు చేసిన మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తు చేసిన అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారని చెప్పారు. చంద్రబాబు రాజధానిని ప్రకటించకుండా నూజివీడు, అక్కడ.. ఇక్కడ అంటూ లీకులు ఇస్తూ తమ బినామీలతో మాత్రం ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయించారన్నారు.

మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలోని రాజధాని ప్రాంతంలో సుమారు 3,500 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. విచారణలో నిజాలన్నీ బయటకొస్తాయన్నారు. దళితుల భూములను విక్రయించరాదని, బదలాయించరాదని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. చట్టాలను అతిక్రమించి.. కేబినేట్‌లో ఆమోదం పొందకుండా అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం, తన అనుంగులకు కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చేలా వాటిని కట్టబెట్టారని విమర్శించారు. దీంతో అమాయకులైన దళిత సోదరులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దళితులకు న్యాయం చేయాలంటూ దళితులే ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేదని, వారి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు