అమరావతి టీడీపీలో ముసలం

3 Oct, 2021 04:16 IST|Sakshi
పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వివరాలు వెల్లడిస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు, పలువురు నాయకులు

పదవుల కేటాయింపులో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని నేతల అసంతృప్తి

మండల అధ్యక్షుడుతో సహా పలువురు పదవులకు రాజీనామా 

తాడికొండ: అమరావతి తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పదవుల పందేరంలో భగ్గుమన్న అసంతృప్తులు పార్టీ పదవుల రాజీనామాకు దారితీశాయి. అమరావతి దళిత జేఏసీలో పనిచేస్తున్న కంభంపాటి శిరీషకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి కేటాయించడంతో భగ్గుమన్న దళిత జేఏసీ సభ్యులు శుక్రవారం రాజీనామా చేసినప్పటికీ అధిష్టానం స్పందించలేదు. దీంతో ఆ సెగ తాజాగా పార్టీకి అంటుకుంది. తుళ్లూరులో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన టీడీపీ మండల అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు అధినేత వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మండల ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు షేక్‌ సాహెబ్‌ జాన్, తెలుగు యువత అధ్యక్షుడు జే తేజ్‌ మొహంత్, మహిళా అధ్యక్షురాలు కే నాగమల్లేశ్వరి, మహిళా ప్రధాన కార్యదర్శి డి. చంద్రకళ, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి పారా నాగేశ్వరరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, ఎస్టీ, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.  

కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వరా?
ఈ సందర్భంగా ధనేకుల మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవులు ఇవ్వకుండా పనిచేయని వారికి రాష్ట్ర పార్టీ నాయకులు పదవులు కేటాయించడం తమకు ఆవేదన కలిగించిందన్నారు. కిందిస్థాయి నుంచి పనిచేసిన తమకు ప్రాధ్యాన్యత లేకుండా నేరుగా పార్టీ కార్యాలయంలో పదవులు కేటాయించడం మంచి పద్ధతి కాదని.. అలాగే,  నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌కు, పార్టీ మండల అధ్యక్షుడు అయిన తనకు తెలియకుండా పదవులు ఇవ్వడంపై మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కోవర్టులుగా పనిచేస్తున్న వారు పార్టీలో పనిచేయని వారిని ప్రోత్సహిస్తూ పార్టీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాజ«ధానిలో అమరావతి పేరిట కొనసాగుతున్న దీక్షలలో టీడీపీ నాయకులే కీలకంగా వ్యవహరిస్తుండగా వీరంతా మాకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడటంతో పార్టీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అమరావతి ఉద్యమానికి ఎసరు పెట్టే పరిస్థితి కనిపిస్తోందంటూ టీడీపీలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. 

మరిన్ని వార్తలు