పంజాబ్‌ సీఎం అమరీందర్‌ రాజీనామా

19 Sep, 2021 04:18 IST|Sakshi
గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌కు తన రాజీనామా లేఖను సమర్పిస్తున్న అమరీందర్‌ సింగ్‌

అవమాన భారంతో వైదొలుగుతున్నా

సీఎం పదవికి సిద్ధూ అసమర్థుడు

అతన్ని నియమిస్తే వ్యతిరేకిస్తా

రాజకీయాల్లోనే కొనసాగుతా

అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న కెప్టెన్‌

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌(79) రాజీనామా చేశారు. అవమానభారంతో పదవి నుంచి వైదొలుగుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూను తదుపరి సీఎంగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని కుండబద్దలు కొట్టారు. కొత్త సీఎంను ఎన్నుకునే అధికారాన్ని అధినేత్రి సోనియాకు అప్పగిస్తూ పంజాబ్‌ సీఎల్‌పీ నిర్ణయించింది. సింగ్‌ రాజీనామాతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో అసమ్మతికి తెరదించినట్లయింది, కానీ రాబోయే ఎన్నికల్లో ఎవరు సారథ్యం వహిస్తారనే  ప్రశ్న మొదలైంది. పంజాబ్‌లో పతనావస్థలో ఉన్న పారీ్టకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తినివ్వడంలో అమరీందర్‌ పాత్ర చాలా ఉంది.

కానీ చివరకు అసమ్మతి రాజకీయాలకు తలొగ్గి, సోనియాతో చర్చల అనంతరం సీఎల్‌పీ సమావేశానికి ముందు రాజీనామాను సమర్పించారు. ఇప్పటికి ఇది మూడో సీఎల్‌పీ సమావేశమని, తాజా సమావేశంపై తనకు కనీస సమాచారం లేదని ఆయన చెప్పారు. తనపై అపనమ్మకాన్ని అవమానంగా భావిస్తున్నట్లు రాజీనామాను గవర్నర్‌కు సమర్పించిన అనంతరం అమరీందర్‌ వ్యాఖ్యానించారు. 50కిపైగా కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు కెప్టెన్‌ను మార్చాలంటూ సోనియాకు లేఖ రాశారు. అమరీందర్‌ రాజీనామాతో సిద్ధూకు, తనకు జరుగుతున్న పోరులో సిద్దూదే పైచేయి అయినట్లయింది.  అమరీందర్‌ ఇష్టానికి వ్యతిరేకంగా సిద్ధూను పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ను చేయడం తెల్సిందే.  

సమయం వచ్చినప్పుడు చెప్తా
రాజీనామా అనంతరం భవిష్యత్‌ ప్రణాళికలపై అమరీందర్‌ స్పందించారు. అన్నింటికీ ఒక ఆప్షన్‌ ఉంటుందని, తనకు సమయం వచి్చనప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో కలిసి భవిష్యత్‌పై సమాలోచన జరుపుతానని చెప్పారు. అధిష్టానం ఎవరిని కావాలనుకుంటే వారిని సీఎం చేయవచ్చన్నారు. కానీ తనను ఎందుకు తొలగించాలని నిర్ణయించుకున్నారో అర్ధం కావడం లేదని వాపోయారు. కాంగ్రెస్‌లో తాను 52 సంవత్సరాలున్నానని, ముఖ్యమంత్రిగా 9ఏళ్లకు పైగా పనిచేశానని గుర్తు చేశారు. ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేసిన సమావేశానికి అజయ్‌ మాకెన్, హరీష్‌ చౌదరీలను అధిష్టానం పరిశీలకులుగా పంపింది. పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ప్రతినిధి హరీష్‌ రావత్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో కాంగ్రెస్‌ కుమ్ములాటలు పారీ్టకి చేటు చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పోరాటాల కెప్టెన్‌
పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్‌ సింగ్‌ తొలుత సైన్యంలో పనిచేశారు. వారిది సైనిక కుటుంబం, 1965, 1971 యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. డెహ్రాడూన్, ఎన్‌డీఏల్లో విద్యాభ్యాసం చేశారు. రిటైర్మెంట్‌ తర్వాత అప్పటి కాంగ్రెస్‌ యువ నేత రాజీవ్‌కు సన్నిహితుడయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు, కానీ బ్లూస్టార్‌ ఆపరేషన్‌కు నిరసనగా రాజీనామా చేశారు. 1985లో అకాళీదళ్‌లో చేరి ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. 1998లో కాంగ్రెస్‌ గూటికి చేరారు. 2002–07లో  పంజాబ్‌ సీఎం అయ్యారు. 2014లో బీజేపీకి చెందిన అరుణ్‌జైట్లీని ఓడించి ఎంపీ అయ్యారు.

2017 పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా తీర్చిదిద్ది అకాళీదళ్‌ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. పదేళ్ల తర్వాత పంజాబ్‌లో గెలిపించినందుకు ఆయన్నే అధిష్టానం సీఎంగా చేసింది. సీఎం అయ్యాక రైతు రుణమాఫీ చేసి రైతాంగంలో ఇమేజ్‌ పెంచుకున్నారు. సిద్దూ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సింగ్‌కు పార్టీపై పట్టు తగ్గుతూ వచ్చింది. సిద్దూను మచ్చిక చేసుకునేందుకు తనకు కేబినెట్‌ పోస్టును సింగ్‌ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. 2019లో సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి అమరీందర్‌పై విమర్శలు పెంచారు. సింగ్‌ రాజీనామా అనంతరం పంజాబ్‌ సీఎల్‌పీ సమావేశం జరిగింది.

‘సిద్ధూ పాక్‌ తొత్తు’
తన పదవికి ఎసరు పెట్టిన సిద్ధూపై కెప్టెన్‌ విమర్శలు చేశారు. సిద్దూను సీఎంగా అంగీకరించనన్నారు. సిద్ధూ దేశానికే వ్యతిరేకమని, పాకిస్తాన్‌ తొత్తు అని తీవ్రంగా నిదించారు. సిద్ధూ అంటేనే సంక్షోభమని, అతను ప్రమాదకారి, అసమర్ధుడు, అస్థిరత్వానికి కారకుడని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌తో కలిసిపోయినవాడు దేశానికి, పంజాబ్‌కు ప్రమాదకరమన్నారు. అలాంటివాడు దేశాన్ని నాశనం చేస్తానంటే అంగీకరించనని, ప్రజలకు చెడు చేసే అంశాలపై పోరాటం చేస్తానని తెలిపారు.

పాక్‌ నాయకత్వంతో సిద్దూకు సత్సంబంధాలున్నాయంటూ.. ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి సిద్దూ హాజరవడ్డాన్ని, ఇమ్రాన్‌ను, పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వాను సిద్ధూ గతంలో ఆలింగనం చేసుకోవడాన్ని, వారిని ప్రశంసించడాన్ని గుర్తు చేశారు. పంజాబ్‌ అంటే దేశ రక్షణ అని, అలాంటి రాష్ట్రానికి సిద్ధూ లాంటివాడు సీఎం కావడాన్ని అంగీకరించనని చెప్పారు. ఒక్క మంత్రిత్వ శాఖనే సరిగ్గా నిర్వహించలేని అసమర్థుడు మొత్తం పంజాబ్‌ను నడిపించడం జరగని పని అని ఎద్దేవా చేశారు. సిద్ధూకు ఎలాంటి సామర్ధ్యం లేదని, తన మాట కాదని సిద్ధూని సీఎంగా చేస్తే అన్ని విధాలుగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు.

సిద్ధూ శకుని పాత్ర పోషిస్తున్నందున తాను సీఎంగా ఉండడని గతంలోనే సోనియాకు చెప్పానని, అప్పుడు రావత్‌ కూడా అక్కడే ఉన్నారని అమరీందర్‌ వెల్లడించారు. కానీ అప్పుడు ఆమె తన అభ్యర్ధన మన్నించలేదన్నారు. కాంగ్రెస్‌కు తాను శక్తిమేర పనిచేశానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలను విరమించే ప్రసక్తి లేదని అమరీందర్‌ స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా తనకు ఇంత అవమానం జరుగుతుందని ఊహించలేదని, కానీ చివరకు తనను తప్పించాలని ఎందుకు నిర్ణయించారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు