బాబు స్కిల్డ్‌ క్రిమినల్‌..

5 Sep, 2023 05:00 IST|Sakshi

కుట్రలు, కుతంత్రాలతో కూడిన రాజకీయ జీవితం ఆయనది

ఆర్థిక నేరాలపై ఇచ్చిన నోటీసులకు స్పందించవే బాబూ!

ఆయన బండారాన్ని ఈడీ బయట పెట్టాలి

సీబీఐ విచారణ జరిపి వారిని జైలుకు పంపాలి

ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రం సర్వనాశనం

చంద్రబాబు ఇప్పుడు దొరికిన దొంగ

మంత్రులు ధర్మాన, గుడివాడ, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌

బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్‌నాథ్‌
అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై  లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు.

చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్‌ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.

తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా
చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్‌కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్‌ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు.

అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్‌ చేయలేదని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్‌ చేశారు.

బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని
చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ  చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. 

చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు.

బాబు, లోకేశ్‌ పెద్ద అవినీతిపరులు: ధర్మాన
ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతి­పరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్ని­కల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లా­డుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకు­రాలేకపోయారన్నారు.

ప్రజలు అప్రమ­త్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికార­మిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తార­న్నారు. ఇక అచ్చె­న్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌­నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు.

మరిన్ని వార్తలు