డీఎల్‌.. వందల కోట్లు ఎలా సంపాదించావ్‌?

17 Oct, 2021 03:59 IST|Sakshi

రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకున్నది చిన్న కొట్టం, రేకుల ఇల్లు

నేను అనర్హుడనని రైతులు చెబితే రాజీనామా చేస్తా

వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి ధ్వజం

కడప కార్పొరేషన్‌: వందల కోట్ల విలువైన ఆస్తులను మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఏ విధంగా సంపాదించారో చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు సుంకేసులలో చిన్న కొట్టం, రేకుల ఇల్లు ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.200 కోట్ల విలువైన ఆస్పత్రి, రూ.20 కోట్ల విలువైన ఇల్లు, వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు.

ఈ ఆస్తులను ఆయన ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలని నిలదీశారు. శనివారం ఆయన వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీవీ సత్రం వద్ద తల్లిదండ్రుల పేరుతో ఆస్పత్రి కడతానని ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూమిని పొంది, తర్వాత దాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లే డీఎల్‌ రవీంద్రారెడ్డికి రాజకీయ భిక్ష లభించిందన్నారు. గతంలో మంత్రి పదవిలో ఉండి వైఎస్‌ జగన్‌కు పోటీగా ఎంపీగా నిలబడి, డిపాజిట్‌ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిన చరిత్ర డీఎల్‌దే అన్నారు. వైఎస్‌ కుటుంబం దెబ్బ రుచి చూసినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. 2014లో పుట్టా సుధాకర్‌ యాదవ్‌తో జతకట్టారని, 2019లో ఎవరూ పిలవకపోయినా వైఎస్సార్‌సీపీలో చేరినా, ఆయన ఏనాడు పార్టీ బలోపేతానికి గానీ, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విజయానికి గానీ కృషి చేయలేదని తెలిపారు.

వ్యవసాయ సలహాదారు పదవికి తాను తగనని డీఎల్‌ మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తాను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టానని, 50 ఎకరాల పొలాన్ని ఇప్పటికీ సాగు చేస్తున్నానని తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను వ్యవసాయ సలహాదారుగా నియమించాక, 100 మండలాలు తిరిగి.. పల్లె నిద్ర చేసి, రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నానని వివరించారు. ఈ పదవికి తాను అనర్హుడనని రైతులు చెబితే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు