ట్యాపింగ్‌ శుద్ధ అబద్ధం

18 Aug, 2020 05:49 IST|Sakshi

ఫోన్ల ట్యాపింగ్‌ జరిగినట్టు చంద్రబాబు వద్ద ఆధారాలున్నాయా? 

అందితే జుట్టు అందకుంటే కాళ్లు.. చంద్రబాబు సిద్ధాంతం

మోదీని ఎన్నికల ముందు దూషించిన బాబు ఇప్పుడెందుకు కీర్తిస్తున్నారు

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: ఏపీలో జడ్జిల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారనేది శుద్ధ అబద్ధమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ప్రధాన మంత్రికి చంద్రబాబు రాసిన లేఖలో మోదీని కీర్తించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అనే సిద్ధాంతం పాటిస్తున్న చంద్రబాబు పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న విధంగా ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

► ఎన్నికల ముందు మోదీని తీవ్రంగా దూషించిన చంద్రబాబు ఇంత బ్రహ్మాండంగా పొగిడే దశకు ఎపుడొచ్చారు? 
► భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా పాలిస్తాడని మోదీని విమర్శించిన చంద్రబాబు తాను సీనియర్‌నని.. మోదీ జూనియర్‌ అనలేదా? మోదీ వల్ల దేశానికి అన్యాయం జరుగుతోందని, మోదీ దుష్ట పాలనను అంతమొందిస్తానంటూ రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రాలు తిరగలేదా?
► ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందని ఏ ఆధారాలతో చంద్రబాబు మాట్లాడతాడు. చంద్రబాబు పది హత్యలు చేశాడని.. లోకేష్‌ మానభంగాలు చేశాడని ఆరోపిస్తే ఆయనిచ్చే సమాధానం ఏమిటి? గతంలో చంద్రబాబు ప్రభుత్వమే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ ట్యాప్‌ చేయించింది. ఇజ్రాయెల్‌ నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను టీడీపీ రాజకీయ అవసరాల కోసం తెప్పించారు. 
► జడ్జీల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారనేది శుద్ధ అబద్ధం. జర్నలిస్టులు సామాజికవేత్తల ఫోన్లను ట్యాపింగ్‌ చేయరు. చట్టప్రకారం ఉగ్రవాదులు, అసాంఘిక నిషేధిత శక్తుల ఫోన్లను ఇంటెలిజెన్స్‌వారు ట్యాపింగ్‌ చేస్తారు. ఇందులో తాను ఏ కోవలో ఉన్నారని చంద్రబాబు భయపడుతున్నారు? ఆయన చేసిన మనీల్యాండరింగ్‌ బయటకు వస్తుందని భయపడుతున్నాడా.
► వీటన్నింటి ఆధారంగా కోర్టులో రిట్‌ పిటిషన్లు వేయడం.. ఆ తర్వాత తాను ఒక లేఖ రాయడం, ఆ లేఖను ఎల్లో మీడియాలో ప్రచురించి డిబేట్‌లు చేయడం చంద్రబాబు మార్క్‌ రాజకీయం. 
► ఇప్పుడు మోదీని పొగుడుతున్న బాబు రేపు ఏదైనా తేడా వస్తే ఆయన దుర్మార్గుడని మాట్లాడగలడు. 
► ట్యాపింగ్‌పై కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించాలని కోరిన చంద్రబాబు తన పాలనలో రాష్ట్రంలో సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. 

ఒక ముఠాను తయారు చేసి.. ఫోన్ల ట్యాపింగ్‌ జరిగినట్టుగా ఓ పథకం ప్రకారం ఒక ఛానల్‌లో అబద్ధపు వార్తలు ప్రసారం చేయడం, మరో ఛానల్‌లో దానిపై చర్చలు పెట్టడం.. ఒకటి, రెండు పత్రికల్లో ఆ అసత్యాన్ని ప్రచురించడం ఆయనకే చెల్లింది.

మరిన్ని వార్తలు