జగన్‌ దెబ్బకు కుప్పానికి పరుగు

27 Feb, 2021 05:19 IST|Sakshi

ఓడింది నువ్వా? ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చెప్పు చంద్రబాబూ..

నువ్వు కుప్పాన్నే కాదు.. రాష్ట్రాన్నీ పట్టించుకోలేదు 

అందుకు ప్రజలు తరిమికొట్టారు

మళ్లీ అధికారంలోకొస్తానని పగటి కలలు కనొద్దు

లోకేష్‌లో ఏదో తేడా..వైద్యం తప్పనిసరి

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ కొట్టిన దెబ్బకు చంద్రబాబు కుప్పం వీధులకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్‌ దమ్మున్న నాయకుడని కుప్పంలో టీడీపీ శ్రేణులే కీర్తించడం విశేషమన్నారు. జగన్‌ భయానికి కుప్పం బాట పట్టిన చంద్రబాబు... ఓడిపోయింది తనా? ప్రజాస్వామ్యమా? ఇప్పుడు చెప్పాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. హామీలిచ్చి మోసం చేసే చంద్రబాబు మరోసారి అదే పనిచేస్తున్నాడని, టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఓ డ్రామా అని ధ్వజమెత్తారు. పులివెందులకు నీళ్లిచ్చానని, కుప్పానికి ఎందుకివ్వరని చంద్రబాబు ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆయనే ఒప్పుకోవడం గమనించాలన్నారు. పులివెందులను వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేస్తే చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం అర్థరహితమన్నారు. ‘‘చంద్రబాబూ.. నువ్వు కుప్పాన్నే కాదు.. రాష్ట్రాన్నీ ఎక్కడా అభివృద్ధి చేయలేదు. అందుకే ప్రజలు నిన్ను తరిమికొట్టారు. మళ్లీ అధికారంలోకొస్తాననే పగటి కలలు మానుకో. పుంగనూరులో పోటీ చేస్తానంటున్నావంటే.. కుప్పాన్ని వదిలేసినట్టేగా?’’ అంటూ అంబటి చురకలేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

టీడీపీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మే దిక్కా?
నామినేషన్‌ రోజు కూడా కుప్పం రాని చంద్రబాబు ఇప్పుడు నాలుగు రోజులపాటు మకాం వేస్తున్నాడు. అక్కడ 89 పంచాయతీల్లో 74 వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుచుకున్నారు. కేవలం 14 మాత్రమే దక్కడంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అక్కడే కాదు.. రాష్ట్రమంతటా జగన్‌ ప్రభంజనం ఆయనకు దడ పుట్టిస్తోంది. కుప్పంలో ఊరేగింపులు... అంతర్గత సమావేశాలు.. ఏం చేసినా జనం మాత్రం చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఆఖరుకు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్లాల్సిన దయనీయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దెబ్బకు భయపడ్డ చంద్రబాబు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి వాడుకున్నారు. ఎన్నికలవ్వగానే అదే వ్యక్తి సినిమాలు కూడా చూడొద్దంటూ అంతర్గత ఆదేశాలిచ్చారు. 

లోకేష్‌లో ఏదో తేడా!
సీఎం జగన్‌పై నారా లోకేష్‌ అసభ్య పదజాలంతో, పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. బహుశా ఆయనలో ఏదో తేడా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆయన కుటుంబసభ్యులు మంచి డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లడం మేలు. లోకేష్‌.. నువ్వొచ్చాకే టీడీపీ పతనమైందని గుర్తుంచుకో. సైకిల్‌ తునాతునకలైంది నువ్వు అడుగుపెట్టాకే. నీ స్థాయేంటో తెలుసుకో. జగన్‌ గన్‌లో బుల్లెట్‌ లేకపోతేనే నువ్వు మంగళగిరిలో శంకరగిరిమాన్యాలు పట్టావా? కుప్పంలో టీడీపీ దిక్కులేని స్థితికెళ్ళిందా? లోకేష్‌.. సమాధానం చెప్పు. దొడ్డిదారిన మంత్రివయ్యావుగానీ.. సీఎం అయ్యే అర్హత నీకీ జన్మలో లేదు. జనసేన కూడా వైఎస్సార్‌సీపీని ప్రశ్నించడం విడ్డూరమే. ముందు ఎవరికో సేవ చేయడం ఆపేసి.. జనం వైపు వెళ్తే మంచిది.  

>
మరిన్ని వార్తలు