ఆ యాప్‌.. టీడీపీ సృష్టే: అంబటి

4 Feb, 2021 05:03 IST|Sakshi

నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించక తప్పదు

అధికారంలోకి వస్తామంటూ అచ్చెన్న పగటి కలలు

చచ్చిన పాము లాంటి చంద్రబాబుపై కక్ష కడతామా? 

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెచ్చిన యాప్‌ టీడీపీ తయారు చేసిందేనని అనుమానాలున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇది అప్రజాస్వామికమని, ఆ యాప్‌ను తాము నమ్మడం లేదని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంలో తయారైన లేఖనే గతంలో నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు యాప్‌ అదే మాదిరిగా ఉందన్నారు. ‘టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యాప్‌ తెచ్చారని భావిస్తున్నాం. పక్షపాతంతో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించక తప్పదు.

అధికారులను అభిశంసన చేయడం, ఇప్పుడు వెనక్కు తీసుకోవడం చూస్తుంటే ఆయనకు కచ్చితమైన విధానం లేదనేది సుస్పష్టం. మంత్రుల హక్కులకు భంగం కలిగిస్తే విచారించే అధికారం ప్రివిలేజ్‌ కమిటీకి ఉంటుంది. విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి’ అని పేర్కొన్నారు. టీడీపీ నేత పట్టాభిని పరామర్శించిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ఆరోపణలపై అంబటి ఘాటుగా స్పందించారు. చచ్చిన పాము లాంటి చంద్రబాబుపై కక్ష కట్టాల్సిన అవసరం తమకెందుకని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు  మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ, నిమ్మగడ్డ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

తాట తీయడానికేనా పదవులు?
నిమ్మాడ పంచాయతీకి నామినేషన్‌ వేస్తున్న సమీప బంధువునే అచ్చెన్నాయుడు బెదిరించారు. అన్ని ఆధారాలు ఉండబట్టే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే అచ్చెన్నాయుడే కాదు చంద్రబాబునైనా అరెస్టు చేయాల్సిందే. రాష్ట్రంలో గందరగోళం సృష్టించడమే టీడీపీ ఎత్తుగడ. ఎల్లో మీడియా ఇందుకోసం కథనాలు వండి వారుస్తోంది. తాను హోంమంత్రి అయ్యాక ఖాకీల తాట తీస్తానని అచ్చెన్న చిందులేశాడు. మంత్రులయ్యేది తాట తీయడానికేనా? చంద్రబాబు ప్రధాని అవుతారని, లోకేష్‌ ముఖ్యమంత్రి, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పంచాయతీ రాజ్‌ మంత్రి, తాను హోంమంత్రి అవుతానని అచ్చెన్న పగటి కలలు కంటున్నారు. టీడీపీ నేత పట్టాభిపై జరిగిన ఘటనను అడ్డుపెట్టుకుని చంద్రబాబు గొప్పగా నటించారు. పట్టాభిపై దాడి జరిగిన రెండుసార్లూ ఆయనకు గాయం కాకుండా కారు అద్దాలు మాత్రమే ఎందుకు పగిలాయి? అయినా దాడులను మా పార్టీ ఏమాత్రం అంగీకరించదు.

రాజకీయ నేతలా నిమ్మగడ్డ తీరు
తూర్పు గోదావరి జిల్లా గొల్లలగుంట పంచాయతీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతిపై విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే మృతుడి ఇంటికి పరామర్శకు వెళ్ళడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ వాళ్లు చనిపోతేనే వెళ్తారా? ఏ పార్టీ వాళ్లు చనిపోయినా వెళ్తారా?  చంద్రబాబుకు బదులుగా లోకేష్‌కు పైలెట్‌ మాదిరిగా నిమ్మగడ్డ పరామర్శకు వెళ్లారా? నిమ్మగడ్డ రాజకీయ నాయకుడిలా పరామర్శకు వెళ్లడం దురదృష్టకరం.   

మరిన్ని వార్తలు