గడప గడపకూ వెళ్లే ధైర్యం ఉందా?

2 Oct, 2022 05:04 IST|Sakshi

చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీసిన జల వనరుల శాఖ మంత్రి అంబటి 

సీఎం వైఎస్‌ జగన్‌ కంటే మంచి పథకాలు అమలు చేశామని చెప్పగలరా?

టీడీపీ వాగ్దానాల అమలుపై కథనాలు రాసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా?

అది ఒళ్లు బలిసిన, కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర 

చంద్రబాబు పని అయిపోయింది.. కుప్పంలో కూడా గెలవలేడు

175కు 175 గెలవబోతున్నామని సీఎం చెబితే ఎమ్మెల్యేలను అవమానించినట్టా రామోజీ?

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాల కంటే గొప్ప పథకాలు అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి చెప్పే ధైర్యం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు ఉందా? 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన 600కు పైగా వాగ్దానాల అమలుపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసే దమ్ముందా?’ అని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేసి.. డీబీటీ రూపంలో రూ.1.71 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి.. గడప గడపకూ వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను చూపించి మరీ హామీలను అమలు చేశామని ప్రజలకు చెబుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. అందుకే గడప గడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. మంత్రి అంబటి ఇంకా ఏమన్నారంటే..

పోలవరంపై ఎలాంటి పేచీలు లేవు..
► కేంద్ర జల వనరుల శాఖ, సీడబ్ల్యూసీ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే 2009–11లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో పోలవరం పనులు జరుగుతున్నాయి. పోలవరం ముంపు వల్ల తమకు నష్టం అంటూ చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయడం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

► ఉమ్మడి సర్వే చేయాల్సిన అవసరం లేదని, భద్రాచలానికి అసలు ముప్పేలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఎల్లో మీడియా ఈ విషయం గురించి మాత్రం రాయలేదు. ‘ఉమ్మడి సర్వేకు పట్టు.. పోలవరంపై కేంద్రాన్ని కోరిన పొరుగు రాష్ట్రాలు’ రాశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే ‘పోలవరంపై పేచీలు’ అని రాశారు. ఎందుకు పేచీలు, ఎవరికి పేచీలు? పక్క రాష్ట్రాలకు మద్దతు పలికేలా ఎల్లో మీడియా రాతలు రాయడం దురదృష్టకరం.

► ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలా అయిపోవాలన్నది ఎల్లో మీడియా కోరిక. కానీ వారి బినామీల భూముల్లో పెట్టిన అమరావతి రాజధాని మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోవాలని రాస్తారు. మా ప్రభుత్వం విధానం వికేంద్రీకరణే అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాం. ఇందులో భాగంగా మూడు రాజధానులను నిర్ణయించాం. అలా ఉండటానికి వీల్లేదని మా ఊర్లోనే రాజధాని ఉండాలంటూ పాదయాత్రలు చేస్తున్నారు. అది రైతుల పాదయాత్ర కాదు.. ఒళ్లు బలిసిన వాళ్ల పాదయాత్ర. మళ్లీ మళ్లీ మాట్లాడితే.. ఇది కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని కూడా చెబుతున్నా. 

► ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా, మూడు ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల వారు, గుండె రగిలిపోయేవాళ్లు, కడుపు మండేవాళ్లు పాదయాత్రలు ప్రారంభిస్తే దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబే. అతడు కుప్పంలో కూడా గెలవడు. 

ఆ అర్హత హరీష్‌కు లేదు..
► తెలంగాణ గురించి ఆ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. మా రాష్ట్రంతో, మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు. మీ రాష్ట్రంలో మీరు బలహీన పడిపోతున్నారని..మమ్మల్ని వేలుపెట్టి చూపిస్తే మీరు బలపడతారని అనుకుంటున్నారా?

► నేను అసెంబ్లీకి ఎప్పుడు రావాలో, ఎప్పుడు గెలవాలో బుచ్చయ్య చౌదరో, చంద్రబాబో నిర్ణయిస్తారా? వాళ్ల దయాదాక్షిణ్యాలతో నేను గెలవలేదు. రెండు సార్లు వద్దనుకునే పోటీకి దూరం.

► రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దాంతో 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో 90శాతానికి పైగా ప్రజా ప్రతినిధులుగా వైఎస్సార్‌సీపీ వారే గెలుపొందారు. 

► పూర్తి అంకిత భావంతో, చిత్తశుద్ధితో ‘గడప గడపకూ..’ చేయడం ద్వారా 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేస్తే.. ఎమ్మెల్యేలను అవమానించినట్లా? వారసులు రాకూడదని సీఎం వార్నింగ్‌ ఇచ్చారంటూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దుష్ప్రచారం చేస్తుండటం దారుణం. ప్రజలు ఆమోదిస్తేనే ఎవరైనా రాజకీయాల్లో రాణిస్తారు. లేదంటే లోకేష్‌లా దొడ్డిదోవ ఎంచుకోవాలి రామోజీ! 

మరిన్ని వార్తలు