పోలవరంలో బాబు గ్యాంగ్‌ దోపిడీ

22 Apr, 2022 05:09 IST|Sakshi

డయాఫ్రం వాల్‌ పేరుతో రూ.430 కోట్లకు బిల్లులు చేశారు

స్పిల్‌వే నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు

దీంతో 2019 వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది

దీనికి చంద్రబాబు, మాజీ మంత్రి ఉమాదే పూర్తి బాధ్యత

మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు ధన దాహానికి పోలవరం బలైందని, స్పిల్‌వే నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించడంతో 2019 వరదల్లో అది పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా నష్టం చేకూర్చడంతోపాటు, ప్రాజెక్టు ఆలస్యమైంద ని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ప్రాజెక్టులోను దెబ్బతినని డయాఫ్రమ్‌ వాల్‌ ఒక్క పోలవరంలోనే దెబ్బతిందని, దీనికి అప్పటి సీఎం చంద్రబాబు, జలవనరుల మంత్రి దేవినేని ఉమ పూర్తిబాధ్యత వహించాలని అన్నారు. పోలవరాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శకు ఇదే నిదర్శనమన్నారు.

డయా ఫ్రమ్‌ వాల్‌ పేరుతో రూ.430 కోట్లు బిల్లులు చేశారని, దెబ్బతిన్న గోతులను పూడ్చడానికి రూ.800 కోట్లు, గోతుల నుంచి నీటిని తోడటానికి రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచ నా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంతో పోలవ రం ప్రాజెక్టు డిజైన్‌లో మార్పుల అంశాలను నిపుణు లతో చర్చిస్తున్నామన్నారు. అనుకున్న గడువులోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రీడిజైనింగ్‌ వల్ల ప్రాజెక్టు ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గదని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారన్నారు. రైతుల ఆత్మహత్మలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. రుణ మాఫీ పేరుతో రైతులను నిండా ముంచిన వారు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

సచివాలయంలో మంత్రిగా బాధ్యతల స్వీకరణ
అంబటి రాంబాబు గురువారం ఉదయం సచివాలయం నాలుగో బ్లాకులో జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం, అంతకు ముందున్న పెండింగ్‌ పనులకు సంబంధించి గండికోట–పైడిపల్లి ఎత్తిపోతల పథకానికి ఆపరేషన్, మెయింటెనెన్స్‌ గ్రాంటుగా రూ.4.70 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మడ్డువలస  ప్రాజెక్టు ఫేజ్‌–2 కెనాల్‌కు సంబంధించి 5 కిలోమీటర్ల కాలువ తవ్వడానికి రూ.26.9 కోట్ల గ్రాంటుకు సీఎం ఆమోదం కోసం పంపించే ఫైలుపై మరో సంతకం చేసినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు