ఓటమి భయంతోనే పలాయనం

3 Apr, 2021 04:50 IST|Sakshi

టీడీపీని గంగలో కలిపేసి క్యాడర్‌ను ముంచేయడం ఖాయం 

లోకల్‌గా పారిపోయి.. జాతీయ స్థాయిలో ఉద్యమమా! 

చంద్రబాబుపై అంబటి ధ్వజం 

సాక్షి, అమరావతి:  ఓటమి భయంతోనే టీడీపీ ‘పరిషత్‌’ ఎన్నికలను బహిష్కరిస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీని గంగలో కలిపేయడమే చంద్రబాబు లక్ష్యమని ఎద్దేవా చేశారు. పార్టీ క్యాడర్‌ను నిండా ముంచేయడం ఖాయమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేక పలాయనం చిత్తగిస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆయనకు రాద్ధాంతాలే తప్ప సిద్ధాంతాలు లేవని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై చంద్రబాబు అవాకులు చవాకులు పేలడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకే ఎన్నికల తంతును త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు చెబుతున్న కారణాలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. నిమ్మగడ్డ ఈఎన్‌సీగా ఉంటే చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించే వారా అని ప్రశి్నంచారు. గెలవలేమని తెలిసి ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించాడని ఎద్దేవా చేశారు. 

తిరుపతిలోనూ పారిపోయినట్టే! 
తిరుపతి ఉప ఎన్నికల నుంచీ ఏదో సాకు చెప్పి పారిపోవడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని అంబటి ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు, టీడీపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. పొట్టకోస్తే అక్షరం ముక్క రాని శుద్ధ మొద్దు లోకేశ్‌ కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రికి హెచ్చరికలు చేస్తున్నాడని అన్నారు. అతని స్థాయి తెలుసుకుని మసలుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఇక వ్యవస్థలను మేనేజ్‌ చేసే పరిస్థితి లేదని, ఆయన శకం ముగిసిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. బీజేపీకి సానుకూలంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు పుదుచ్చేరి వెళ్లారనడం అవాస్తవమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ నుంచి తప్పుకునేది లేదని చెప్పారు. ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు.  

 

>
మరిన్ని వార్తలు