బాబు పాపం వల్లే ‘పోలవరం’ ఆలస్యం 

6 May, 2022 04:47 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న మంత్రి అంబటి రాంబాబు

సాధ్యమైనంత త్వరలో మేమే పూర్తిచేస్తాం

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

పోలవరం రూరల్‌/దేవీపట్నం: చంద్రబాబు పాపం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును తామే పూర్తిచేస్తామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గురువారం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ఉభయగోదావరి జిల్లాల మధ్య జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనులను, కోండ్రుకోట పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడమే కారణమని చెప్పారు. ప్రాజెక్టులో కీలక పనులు వదిలేసి, త్వరితగతిన పూర్తయ్యే పనులు చేసి వాటి బిల్లులను పాస్‌ చేయించుకోవాలనే తాపత్రయంతో అప్పటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని చేసిన పాపం వల్లే ఇలా జరిగిందన్నారు.

దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ఎక్కడా డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినలేదని, కేవలం చంద్రబాబునాయుడు వల్లే ఇక్కడ జరిగిందని చెప్పారు. దీంతో దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పునరుద్ధరణకు అధికారులు మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నారని తెలిపారు. సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్‌పీ సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటికే రూ.47 వేల కోట్లకు పెరిగిందని, ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

అనంతరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి అంబటి మాట్లాడుతూ నిర్వాసితులకు సమగ్ర పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాసితులకు అదనంగా ప్యాకేజీ ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, జెన్‌కో ఎస్‌ఈ శేషారెడ్డి, జేసీ పి.అరుణ్‌బాబు, ఆర్డీవో ఎం.ఝాన్సీరాణి, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ప్రవీణ్‌ ఆదిత్య, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొవ్వూరు త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు