పోలవరంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు

2 Jun, 2022 05:54 IST|Sakshi

జాప్యానికి మీ నిర్వాకమే కారణం కాదా?

లోపభూయిష్టంగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం

దీనిపై చర్చ జరగాలి

మంత్రి అంబటి రాంబాబు

సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఎన్నికలకు వెళతామన్న పెద్దమనిషి బాబు, అప్పటి మంత్రి దేవినేని ఉమా ఎందుకు పూర్తిచేయలేకపోయారని నిలదీశారు. అటువంటి వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణం కోసం అడుగుతున్నారని ప్రశ్నించారు.

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు అండ్‌ కో చేసిన తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరిగిందని, ఇప్పటికీ జరుగుతోందని చెప్పారు. గతం మరిచిపోయి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేస్తారో తేదీలు ప్రకటించాలని తమ ప్రభుత్వాన్ని అడగడం సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు.

డయాఫ్రమ్‌ వాల్‌ను లోపభూయిష్టంగా నిర్మించి పోలవరం ప్రాజెక్టును అధోగతి పాల్జేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి తాను కారణం కాదని బహిరంగంగా చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. డయాఫ్రమ్‌ వాల్‌ ఎవరి అలసత్వం వల్ల దెబ్బతిన్నదనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని తాము నిజాయితీగా కోరుకుంటున్నామని చెప్పారు.

ఈ విషయంలో మేధావులు, నీటిపారుదలరంగ నిపుణులు చర్చించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం కాఫర్‌ డ్యామ్‌ పూర్తికాకుండానే అనాలోచితంగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టడంతో నగదు వృధాతో పాటు ప్రమాదకర పరిణామంగా మారిందన్నారు. చంద్రబాబు తెలివితక్కువ పని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పారు.

డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతు చేయాలా, పునర్నిర్మించాలా.. అనే విషయంపై ఇరిగేషన్‌ నిపుణులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇంతటి బహుళార్థ ప్రాజెక్టు నిర్మాణం ఏ తేదీకి పూర్తవుతుందనేది చెప్పడం సాధ్యంకాదని, ఒక్క పోలవరం ప్రాజెక్టు కాకుండా ఏ ప్రాజెక్టులోనైనా ఈ విషయాన్ని చెప్పలేమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు