ఓటమి భయంతోనే ఉన్మాదపు కూతలు

21 Aug, 2022 03:50 IST|Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ‘అంబటి’ ఫైర్‌

ఎన్నికలు ఎప్పుడు జరిగినా 25కు 25 లోక్‌సభ స్థానాలూ వైఎస్సార్‌సీపీవే 

అధికారంలో ఉన్నప్పుడు అగ్రకుల అహంకారంతో పేట్రేగిపోయిన టీడీపీ అధినేత 

అందుకే 2019లో బాబును 23 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు 

దింపుడుకళ్లం ఆశలతో ఇప్పుడు ‘అంబేడ్కర్‌’ జపం 

పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని పసిగట్టిన చంద్రబాబు నిరాశ నిస్పృహలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్మాదపు కూతలు కూస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అగ్రకుల అహంకారంతో పెట్రేగిపోయిన ఆయన.. ఇప్పుడు దింపుడు కళ్లం ఆశతో అంబేడ్కర్‌ పేరును జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.

అధికార మదం, అగ్రకుల దురంహకారంతో అప్పట్లో ఉన్మాదిలా ఊగిపోయిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొట్టి 23 సీట్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు. సమాజ హితం మరచి ‘సామాజిక’ హితం కోసం పరితపిస్తున్న ఆయన్ను వచ్చే ఎన్నికల్లో పేడపూసిన చెప్పుతో కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

25 లోక్‌సభ స్థానాలు వైఎస్సార్‌సీపీవే 
ఇటీవల దేశవ్యాప్తంగా నాలుగు జాతీయస్థాయి సంస్థలు చేసిన సర్వేల్లో.. రాష్ట్రంలో 18–23 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటుందని తేలింది. ఈ నాలుగు సర్వేలతో మేం పూర్తిగా ఏకీభవించం. ఎందుకంటే.. సీఎం జగన్‌ సంక్షేమ, సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్‌సీపీకి ఓట్ల శాతం పెరుగుతోంది. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా 25కు 25 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం ఖాయం.  

అప్పులతో 1.50 కోట్ల కుటుంబాల్లో వెలుగులు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భారీగా అప్పులుచేసి.. రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెడుతోందని చంద్రబాబు మాట్లాడటం హేయం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి.. వాటిని సుజనాచౌదరి, రాయపాటి సాంబశివరావు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు వంటి ఐదారుగురికి దోచిపెట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన అప్పులను.. సంక్షేమ పథకాల ద్వారా 1.50 కోట్ల కుటుంబాల ఖాతాల్లో జమచేసి వారి పురోభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇక ఎంపీ గోరంట్ల మాధవ్‌ మార్ఫింగ్‌ వీడియోతో చంద్రబాబు జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తుండటం నీచం.  

పారిపోయిన పిరికిపంద చంద్రబాబు 
విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను టీడీపీ సర్కార్‌ ఎందుకు తీసుకుంది?.. 2018 నాటికే పోలవరాన్ని పూర్తిచేస్తామని శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చి.. ఎందుకు పూర్తి చేయలేకపోయారు?.. వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌లు కట్టకుండా ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడం చారిత్రక తప్పిదమా? కాదా?.. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడిగితే.. జవాబు చెప్పకుండా పారిపోయిన పిరికిపంద చంద్రబాబు. కమీషన్ల కక్కుర్తితో  పోలవరాన్ని సర్వనాశనం చేసింది ఆయనే.

ఇక ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించి.. పోలవరం పనులను రామోజీరావు కొడుకు వియ్యంకుడికి చెందిన  నవయుగకు  అప్పగించి అడ్డగోలుగా దోచేశారు. సీఎం జగన్‌ ఆ కాంట్రాక్టును రద్దుచేసి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 12.6 శాతం తక్కువ ధరకే ‘మేఘా’కు అప్పగిస్తే.. తమ దోపిడీకి అడ్డుపడిందనే అక్కసుతో రామోజీరావు పోలవరంపై తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు.   

మరిన్ని వార్తలు