చంద్రబాబు నిర్వాకంతోనే ఈ దుస్థితి

16 Apr, 2022 04:23 IST|Sakshi

పోలవరం ప్రాజెక్టులో ఏదో జరిగిపోతోందని ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం

జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

బాబు కమీషన్ల కక్కుర్తితో దెబ్బతిన్న పోలవరం కాఫర్‌ డ్యామ్, డయా ఫ్రంవాల్‌ 

ఎవరి వల్ల రూ.800 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందో చెప్పాలిగా!

చెత్త పనులు చేసిన చంద్రబాబును రామోజీ ప్రశ్నించరా?

పోలవరాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంది

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక విషం కక్కుతోందని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏదో జరిగిపోతున్నట్లు ప్రజల్లో నెమ్మదిగా విషం ఎక్కించే పని చేస్తోందని విమర్శించారు. పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అంటూ లేనిపోనివి రాసిందని మండిపడ్డారు. అదే చంద్రబాబు హయాంలో శరవేగంతో పోలవరం పనులు జరిగాయని సదరు ఈనాడు పత్రిక రాసిందని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టులో పురోగతి 1.46 శాతం మాత్రమేనని, ఇసుక కోతకు, గుంతలు పూడ్చేందుకు, డ్రెడ్జింగ్‌ పరిష్కారంగా రూ.800 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వంపై అభాండాలు వేయడం సరికాదన్నారు. రామోజీరావు వాస్తవాలు ఏమిటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు కమీషన్ల యావ వల్లే కాఫర్‌ డ్యామ్, డయా ఫ్రం వాల్‌ దెబ్బతిన్నాయన్నారు. స్పిల్‌ వే పూర్తి కాకుండానే కాఫర్‌ డ్యాం, డయా ఫ్రం వాల్‌ కట్టింది బాబు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్లే రూ.800 కోట్లు ప్రభుత్వం తిరిగి ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. చెత్త పనులు, పిచ్చి పనులు చేసిన చంద్రబాబును ఈనాడు రామోజీరావు ప్రశ్నించరా? అని నిలదీశారు. మంత్రి అంబటి ఇంకా ఏమన్నారంటే..

వాస్తవాలు తెలుసుకోరా?
► పోలవరం జాతీయ ప్రాజెక్టు. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా దశల వారీగా నింపుతారు. ఒకేసారి నింపితే ప్రమాదం. నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులు దశల వారీగానే నింపారు. ఈ వాస్తవాలు తెలుసుకోరా?
►  పోలవరం ప్రాజెక్ట్‌ 45.72 మీటర్ల ఎత్తులో ఒకేసారి నీళ్లు నింపి, పునరావాసం కల్పించడం సాధ్యం కాదని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ రెండు దశలుగా డివైడ్‌ చేసింది. 41.15 మీటర్లకు ఏఏ గ్రామాలు అయితే ముంపునకు గురవుతాయో తొలుత ఆ గ్రామాలకు పునరావాసం పూర్తి చేస్తారు. 41.15 మీటర్ల వరకు నీటిని నింపి ప్రాజెక్ట్‌ను పరీక్షిస్తారు. ఆ తర్వాత నీటి నిల్వ పెంచుకుంటూ.. ఆ మేరకు పునరావాసం కల్పిస్తూ వెళతారు. పీపీఏ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సూచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. 

ఎల్లో మీడియా కుట్రలు అర్థం చేసుకోవాలి 
►  చంద్రబాబు స్పిల్‌వే కట్టకుండా కాçఫర్‌ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశారు. అందుకే అది వరదలకు కొట్టుకుపోయింది. డయాఫ్రం వాల్‌ సైతం కొట్టుకుపోయింది. ఇప్పుడు వీటిని మళ్లీ కట్టాల్సి వచ్చింది. ఇలా ప్రపంచంలోనే మొదటిసారి జరిగింది. ఈ విషయం కూడా రాయాలి కదా!
►  వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పోలవరం పనులు చేస్తున్నారు. కానీ ఎల్లో మీడియాకు అదేమీ పట్టడం లేదు. ఇటీవల సీఎం జగన్, కేంద్ర మంత్రి.. పోలవరం పనులు, పునరావాస కాలనీలు పరిశీలించారు.  నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాలోనే డబ్బులు వేసేలా చర్యలు చేపట్టారు.
► పోలవరం ప్రాజెక్టు ఎవరివల్ల ఆలస్యమైంది? ఈ ప్రాజెక్టును ఎవరు ఏటీఎంగా మార్చుకున్నారు? అనే విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా చెప్పడం మరిచారా?  పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించం అని అసెంబ్లీలో సీఎం జగన్‌ స్వయంగా చెప్పడం వినలేదా?
► పోలవరం, ఆర్టీసీ చార్జీలపై ఎల్లో మీడియా దొంగ రాతలు రాస్తోంది. చంద్రబాబు, వారి గెజిట్‌ పత్రిక ఈనాడు రామోజీరావు కలిసికట్టుగా చేసే కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. అనివార్య పరిస్థితుల్లో కరెంట్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. కేంద్ర ప్రభుత్వం దాదాపు ప్రతిరోజూ డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతుండటం ఎల్లో మీడియాకు కనిపించదా?  
► పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. మృతులకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ తరఫున రూ.25 లక్షలు పరిహారం అందించింది. టీడీపీ హయాంలో ఇలా ఎప్పుడైనా పరిహారం అందిందా?

మరిన్ని వార్తలు