ఒళ్లు బలిసినవారి పాదయాత్ర

28 Sep, 2022 06:30 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అంబటి ధ్వజం 

పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం 

కోడూరు (అవనిగడ్డ): రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తున్న పాదయాత్ర ఒళ్లు బలిసినవారు, ధనవంతులు చేస్తున్న పాదయాత్ర అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా కోడూరు మండలంలో జరిగిన వైఎస్సార్‌ చేయూత నగదు చెక్కు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే.. దాన్ని సహించలేక ఒళ్లు బలిసినవారు, ధనవంతులు పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.

పాదయాత్రలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కవి్వంపుచర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర పేరుతో కొంతమంది గుడివాడలో కొడాలి నానిపై తొడకొట్టారని, ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడ కూడా తొడలు కొట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇలా తొడలు కొట్టినంతమాత్రాన వికేంద్రీకరణ ఆగదని స్పష్టం చేశారు. 

కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం 
కుప్పంలోని పలు మండలాలు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసిందని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని చెప్పారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఫెయిల్‌ అయ్యారన్నారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును కాపాడేందుకే పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని పెట్టారని చెప్పారు.

ఇలాంటి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ వంటివారు ఎంతమంది వచ్చినా కూడా మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. పేదప్రజల కోసం జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నట్లే.. ప్రజలు రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఈవీఎం మిషన్‌పై ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి  ఏఎంసీ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు