రాష్ట్రంలో దురదృష్టకర పరిణామాలు..

18 Nov, 2020 16:58 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన రాజ్యాంగ వ్యవస్థకు అధిపతి అని లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌ నిర్వహించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం అభిప్రాయం తీసుకుని సమన్వయంతో వెళ్లాల్సిన బాధ్యత నిమ్మగడ్డపై ఉందన్నారు. ఎన్నకలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. మొన్నేమో ఎన్నికలు వాయిదా వేయాలని, ఇవాళేమో ఎన్నికలు పెట్టాలని తాపత్రయం చూపిస్తున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ తీరు చూస్తుంటే ఆయనను వెనకుండి తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

గతంలో హఠాత్తుగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేశారని, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్  పెట్టాలి అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్న అనంతరం, కలెక్టర్ల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కానీ నిమ్మగడ్డ ఇష్టానుసారం వ్యవహరించడం చట్ట వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరైనది కాదని, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తే తప్పు అవుతుందన్నారు. న్యాయస్థానాలు కూడా దీనిని ఖండిస్తాయన్నారు. ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఎన్నికలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్నికలను చూసి పారిపోవలసిన కర్మ తమకు పట్టలేదన్నారు. చంద్రబాబు చెప్పినట్టు ఎలక్షన్‌ కమిషనర్‌ ఆడటం చాలా దురదృష్టకరమైన పరిణామంగా తాము భావిస్తున్నామని, ఇది సరైన విధానం కాదని అంబటి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా