కాసినో, పేకాట కింగ్‌లు టీడీపీ వారే

24 Jan, 2022 04:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: కాసినో, పేకాట కింగ్‌లు టీడీపీ వాళ్లేనని, 365 రోజులూ క్లబ్బులను నడిపిన నీచ సంస్కృతి టీడీపీ వారిదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఆ సంస్కృతి, సంప్రదాయాలు తమ ప్రభుత్వానికి లేవన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడ సంఘటన సరే.. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న క్యాబరే, బెల్లీ డ్యాన్సుల మీద యుద్ధం చేస్తారా? అంటూ చంద్రబాబుకు అంబటి సవాల్‌ విసిరారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? 365 రోజులు క్లబ్బులను మేనేజ్‌ చేసిన మాట వాస్తవం కాదా? మాగంటి బాబు క్లబ్బులు పెట్టి పేకాట ఆడించాడా లేదా? గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని ఏడాది పొడుగునా పేకాట ఆడించి, కోటానుకోట్ల డబ్బులు తీసుకుంటే చూస్తూ ఊరుకున్నది మీరు కాదా? ఆ రోజు ఏమైంది తెలుగు సంస్కృతి? గుడివాడ మీద ప్రేమలేక కొడాలి నానిపై కక్షతోనే చంద్రబాబు నానా యాగీ చేయిస్తున్నార’ని అంబటి మండిపడ్డారు. తన కన్వెన్షన్‌ సెంటర్‌లో అటువంటివేవీ జరగలేదని నాని చాలా స్పష్టంగా చెప్పడంతో టీడీపీ నేతలు ఇప్పుడు మాట మార్చేసి కన్వెన్షన్‌ సెంటర్‌లో కాదు, దాని పక్కన జరిగిందని అంటున్నారని ఎద్దేవా చేశారు. 

రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసేవి ఇవీ..
రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసేవి క్యాబరేలా.. బెల్లీ డ్యాన్స్‌లా? అని అంబటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరిగిన కొన్ని ఈవెంట్స్‌కు సంబంధించిన డ్యాన్సుల వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. అవసరమైతే ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి చూసుకోవచ్చునన్నారు. ఈ డ్యాన్సులు సంస్కృతి గురించి గగ్గోలు పెట్టే టీడీపీ వాళ్లందరి రాజగురువు రామోజీరావు ఫిల్మ్‌ సిటీలో వేశారని అంబటి వెల్లడించారు. ఇవి క్యాబరే, బెల్లీ డ్యాన్స్‌లని ఆయనన్నారు. కొడాలి నానిని అడుగుతున్న టీడీపీ వాళ్లు.. 365 రోజులు క్యాబరే నడుపుతున్న రామోజీరావుని నిలదీయగలరా అని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి సందర్భంగా మూడ్రోజులు ఏదో ఎక్కడో జరిగితే దానిని నానికి అంటగడతారా? అని మండిపడ్డారు. కరోనా వచ్చి ఆయన హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఉంటే.. నాని ప్రాంగణంలో జరిగిందని కాసేపు.. కాదు ఆ ప్రాంగణం పక్కన జరిగిందని మరికాసేపు.. కాదు కాదు, నాని ఊరిలో జరిగిందని.. వైఎస్సార్‌సీపీ వాళ్లు జరిపారని.. ఇలా ఇన్ని రకాలుగా నాలుక మడతేస్తారా.. అని ఎద్దేవా చేశారు. కొడాలి నానిపై కక్ష ఉంటే ఎన్నికల్లో తేల్చుకోవాలిగానీ, ఇలా చేయటం సరికాదన్నారు. రాష్ట్రంలో చట్టబద్ధపాలన సాగుతోందని అంబటి స్పష్టంచేశారు.

ఉద్యోగులను ఆదరించే ప్రభుత్వమిది
ఎయిర్‌పోర్టులు, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ.. ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంచేయమని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలిస్తే.. దీనిపై టీడీపీ, దాని తోక పార్టీలు రకరకాలుగా విమర్శలు చేస్తున్నాయని కూడా అంబటి  మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న మెడికల్‌ కాలేజీలపైనా వారు నోటికొచ్చినట్లు మాట్లాడడంపై ఆయన ఇదే రీతిలో  స్పందించారు. అభివృద్ధిని చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని చెప్పారు. ఇక తమది ప్రభుత్వోద్యోగులను ఆదరించే.. వారి సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబేనని ఆయన విమర్శించారు.  

మరిన్ని వార్తలు