బంగ్లా పీఎం పర్యటన వేళ.. అస్సాం సీఎం ‘అఖండ భారత’ వ్యాఖ్యల దుమారం

7 Sep, 2022 14:57 IST|Sakshi

గౌహతి: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సంచలన వ్యాఖ్యలే చేశారాయన. 

‘‘భారత దేశం ఏకతాటిపైనే ఉంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా.. సిల్చార్‌ నుంచి సౌరాష్ట్ర దాకా ప్రజలంతా ఒక్కటిగానే ఉన్నాం. అలాంటప్పుడు కాంగ్రెస్‌ యాత్రతో ప్రయోజనం  ఏముంటుంది?. కాబట్టి, రాహుల్‌ ఇలాంటి యాత్రను పాకిస్తాన్‌లో నిర్వహించుకుంటే మంచిదని హిమంత ఎద్దేశా చేశారు. వాస్తవానికి దేశాన్ని విభజించింది కాంగ్రెస్సే. ఒకవేళ తన ముత్తాత(నెహ్రూను ఉద్దేశించి) చేసిన పనికి(విజభనను ఉద్దేశించి..) రాహుల్‌ గాంధీ గనుక పశ్చాత్తపం చెంది ఉంటే గనుక.. భారత్‌జోడో యాత్ర చేయాల్సిన అవసరమే లేదు. కావాలనుకుంటే పాక్‌, బంగ్లాదేశ్‌లను తిరిగి ఐక్యం చేసి అఖండ భారతాన్ని సృష్టించొచ్చు అని అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. అస్సాం సీఎం విలీనం వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉండగానే.. ఆయన బంగ్లాదేశ్‌ విలీనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పర్యటనలో ఉన్న ఆమె ఇప్పటికే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కూడా. అంతేకాదు ఇరు దేశాల మధ్య ఏడు ఎంవోయూలపై సంతకాలు కూడా జరిగాయి.

అఖండ భారతావని అనేది ఆరెస్సెస్‌ వాదన. పాక్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, అఫ్గనిస్తాన్‌, టిబెట్‌, మయన్మార్‌లు సంఘటితంగా ఉంటేనే.. అది అఖండ భారతం అని చెప్తుంటుంది.గతంలో కాంగ్రెస్‌లో ఉన్న హిమంత.. 2015లో బీజేపీలో చేరారు.  ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం భారత్‌ జోడో యాత్ర ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: తొలిసారి తండ్రి స్మారకం వద్ద రాహుల్‌ 

మరిన్ని వార్తలు