ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్‌ బన్సల్‌ భేటీ 

20 May, 2023 04:59 IST|Sakshi

నాలుగైదు రోజులుగా పలువురు నేతలు దేశ రాజధానికి..

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలపై అభిప్రాయ సేకరణ? 

బండిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవచ్చనే ప్రచారం 

జూన్‌ 2కు ముందే కీలక ప్రకటనలు వచ్చే చాన్స్‌ 

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: కర్ణాటకలో ఓటమితో అప్రమత్తమైన బీజేపీ అధినాయకత్వం అది పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణపై పూర్తి ఫోకస్‌ పెట్టింది. నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్టీ నాయకులు, యంత్రాంగం ఐకమత్యంతో ముందుకు సాగే విషయంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా సీనియర్‌–జూనియర్లు, కొత్తగా పార్టీలో చేరినవారు– గతం నుంచి పార్టీలో ఉన్న వారు, ముఖ్యనేతల మధ్య అంతరం లేకుండా ఉండేందుకు కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో బీజేపీ గెలుపుపై విశ్వాసం కలిగించేందుకు సీనియర్లతో వేర్వేరుగా సమాలోచనలు సాగిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌తో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఢిల్లీలోనే ఉన్న జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డితో­నూ ఆయా విషయాలపై మాట్లాడారు.

శుక్రవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తమే వచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ... కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యనేతల నుంచి జరుపుతున్న అభిప్రాయసేకరణలో భాగంగానే బండికి పిలుపు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

కొత్త అధ్యక్షుడు.. కొత్త కేబినెట్‌ 
కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో తెలంగాణలో గెలుపునకు అవసరమయ్యే అన్ని వ్యూహాలను పార్టీ అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే పారీ్టకి కొత్త అధ్యక్షుడితోపాటు, కొత్త ఎన్నికల కమిటీ చైర్మన్, ప్రచార కమిటీ చైర్మన్లు రానున్నారని ఢిల్లీ పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని మారిస్తే ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రానున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకొని కేబినెట్‌ బెర్తుల భర్తీ ఉంటుందని, అందులోభాగంగానే తెలంగాణ నుంచి సంజయ్‌కు అవకాశం ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను శుక్రవారం ఢిల్లీ పిలిపించారని, ఆయన ఢిల్లీలోని కొందరు పెద్దలను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.  

కీలక బాధ్యతల అప్పగింతపై దృష్టి
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ పట్టిష్టత, నేతలకు కీలక బాధ్యతల అప్పగింతపై దృష్టి పెట్టిన బీజేపీ అధినాయకత్వం కార్యాచరణలో వేగం పెంచింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు సహా ఇతర కీలక పోస్టుల్లో నియామకాలకు సంబంధించి రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది.

కులాలు, ప్రాంతాలు, వర్గాలు, సీనియార్టీ, అనుభవం ఆధారంగా లెక్కలు వేసుకుంటున్న పార్టీ ఎవరికి ఏ పదవి కట్టబెట్టాలన్న దానిపై వివరాలు తీసుకుంటోంది. మరో రెండ్రోజులపాటు అందరి అభిప్రాయాలను తెలుసుకున్నాక జూన్‌ 2కి ముందే నియామకాలపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అలాగే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఇతర నేతల చేరికల విషయంలో హైకమాండ్‌ భరోసా ఇవ్వాల్సిన అవసరం  ఉందని రాష్ట్ర నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు