గ్యారంటీ ఇస్తున్నా.. కేసీఆర్‌ సర్కార్‌ మాయమవుతుంది: అమిత్‌షా

21 Aug, 2022 19:38 IST|Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్‌  సర్కార్‌.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు.
చదవండి: రైతులతో అమిత్‌ షా భేటీ.. కేసీఆర్‌ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు

మజ్లిస్‌ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ జరపట్లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ‘‘పేదవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేసీఆర్‌ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3వేలు ఇస్తామని కేసీఆర్‌ మాట తప్పారు. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా’’ అంటూ అమిత్‌ షా ప్రశ్నించారు.

ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అందిందా?. గిరిజనులకు భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్‌ ఇచ్చారా?. ఉద్యోగాలు కేసీఆర్‌ కుటుంబాలకు తప్ప ఎవరికీ దక్కలేదు’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారంటూ’’ అమిత్‌షా ధ్వజమెత్తారు.

బీజేపీలోకి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి అమిత్‌షా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయనని’’ ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు.

కేసీఆర్‌ పాలనకు అంతం పలుకుతాం: విజయశాంతి
రైతుల్ని, దళితుల్ని కేసీఆర్‌ మోసం చేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. మునుగోడు నుంచే కేసీఆర్‌ పాలనకు అంతం పలుకుతామన్నారు. కేసీఆర్‌కు ఫ్రస్టేషన్‌ ఎక్కువైపోయిందన్నారు. తప్పు చేసిన వారే భయపడతారన్నారు. కేసీఆర్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. కేసీఆర్‌ ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ నాయకుల్ని వేరు చేయలేదరని విజయశాంతి అన్నారు.

కేసీఆర్‌ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా?: ఈటల రాజేందర్‌
ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎనిమిదేళ్లుగా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్‌లో అడుగుపెట్టారా? ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్‌ పార్టీ మద్దతా అంటూ ఈటల మండిపడ్డారు. ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్లను రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు?. కేసీఆర్‌ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా? అని ఈటల ప్రశ్నలు సంధించారు.

మరిన్ని వార్తలు