రెచ్చగొట్టేందుకే కేసీఆర్‌ ఆరోపణలు.. రైతులతో భేటీలో అమిత్‌షా 

22 Aug, 2022 03:07 IST|Sakshi

రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. రైతుల ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్య 

తాను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని.. మీరూ చేయండి అని రైతులకు సూచన 

హైదరాబాద్‌లో ‘అమూల్‌’ ద్వారా సేంద్రియ ఉత్పత్తులు సేకరిస్తామని హామీ 

రాష్ట్రంలో ఐదు ఆర్గానిక్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. సీఎం కేసీఆర్‌ కేవలం రైతులను రెచ్చగొట్టేందుకే ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన.. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో 17 మంది ఆదర్శ రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, కేసీఆర్‌ పాలన, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న సీఎం కేసీఆర్‌ ఆరోపణలను ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన అమిత్‌షా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టేందుకే కేసీఆర్‌ అర్థంపర్థంలేని వాదనలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటికి వెళ్లిందని.. పంట నష్టపోతున్న రైతులు పరిహారం రాక అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, రైతు ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు.. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టిసారించాలని అమిత్‌షా సూచించారు. 

బీమా లేక నష్టపోతున్నాం..
రాష్ట్రంలో ఫసల్‌ బీమా యోజన పథకం అమలుగాక నష్టపోతున్నామని కొందరు రైతులు అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు. తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ.. తనకు పదెకరాల భూమి ఉందని, గతంలో వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని చెప్పారు. కొంత భూమిని అమ్మేసి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టానని, దీనితో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు.

దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. సేంద్రియ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందని, తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని పేర్కొన్నారు. తనవద్ద మేలుజాతి ఆవులు ఉన్నాయని.. అందులో ఒకటి 12వ జనరేషన్‌ గోమాత అని చెప్పారు. ఆ గోమాతకు మహాలక్ష్మిగా నామకరణం చేసి తన మనవడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఆర్గానిక్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయంలో ఇబ్బంది ఉందని కొందరు రైతులు షా దృష్టికి తీసుకురాగా.. త్వరలో అమూల్‌ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని అన్నారు.
చదవండి: కుటుంబ పాలనకు చరమగీతం

మరిన్ని వార్తలు