నయా నిజాంను దింపుదాం

15 May, 2022 04:41 IST|Sakshi

ఇంత అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు

కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌

మేం అధికారంలోకి వస్తే మతపర రిజర్వేషన్లు రద్దు చేస్తాం

టీఆర్‌ఎస్‌ ఓటమి గోడమీద రాతలా నిర్ణయమై పోయింది

రేపే ఎన్నికలు పెట్టినా బీజేపీ గెలుస్తుంది

టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం ఒవైసీల చేతిలో ఉంది

బీజేపీ పాదయాత్ర అధికారం కోసం కాదు.. బడుగు, బలహీనవర్గాల కోసమే..

తుక్కుగూడ సభలో కేంద్ర హోంమంత్రి ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘నయా నిజాం ప్రభువు కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ సర్కారును గద్దె దింపడమే మా లక్ష్యం. ఇంత అసమర్థ సీఎంను, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో ఊడబెరికి.. నియంత, కుటుంబ పాలనకు గుణపాఠం చెప్తాం..’’అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేసే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని పాలనను తెలంగాణలో తీసుకొచ్చేలా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం హైదరాబాద్‌ శివార్లలోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

ఈ ప్రభుత్వాన్ని ఊడబెరకాలి.. 
‘‘తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి.. రజాకార్ల ప్రతినిధుల చంకలో దూరిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఊడబెరకాల్సిన సమయం ఆసన్నమైంది. కుటుంబ, అప్రజాస్వామిక టీఆర్‌ఎస్‌ పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తం చేయాల్సిన అవసరం ఉంది. 

ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే.. భారతదేశానికి సమగ్ర స్వరూపం ఏర్పడడానికి దోహదపడిన సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అనేది బీజేపీ కోసం కాదు. దళితులు, అణగారిన వర్గాలు, రైతులు, యువత, మహిళల పురోగాభివృద్ధి, మెరుగైన భవిష్యత్‌ కోసమే. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడే పథకాలను.. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా సంపూర్ణంగా అమలు చేస్తాం. 
తుక్కుగూడ సభలో వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. చిత్రంలో ఈటల రాజేందర్, జితేందర్‌ రెడ్డి, రఘునందన్‌రావు, కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్‌రావు, లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్, విజయశాంతి, ఇంద్రసేనా రెడ్డి, రాజాసింగ్‌ తదితరులు 

మంత్రతంత్రాలను నమ్ముకుంటే మేలు చేసేదెలా? 
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఆ కల సాకారమైందా? ఇన్నేళ్లుగా టీఆర్‌ఎస్, కేసీఆర్‌ ఏం చేస్తున్నట్టు? ఇప్పటికైనా తెలంగాణ ఆకాంక్షలను మేం సాకారం చేస్తాం. కేసీఆర్‌ ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదు. సెక్రటేరియట్‌కు వెళితే ప్రభుత్వం పడిపోతుందని ఎవరో తాంత్రికుడు చెప్పాడట. అందుకే వెళ్లడం లేదు.

మంత్రతంత్రాలను నమ్ముకునే ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందా? డబుల్‌ బెడ్రూం ఇళ్లు అన్నారు.. ఇవ్వలేదు. కనీసం పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రధాని ఆవాస్‌ యోజన పథకాన్ని కూడా అమలు చేయలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు. 30 సెంటీమీటర్ల భూమి కూడా ఇవ్వలేదు. నువ్వు నీ కొడుకు, బిడ్డకు అధికారం ఇచ్చుకున్నావు. కానీ పంచాయతీలకు, సర్పంచ్‌లకు అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను పట్టించుకోని కేసీఆర్‌.. హైదరాబాద్‌ చుట్టూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తారా? 

కమీషన్లు రావని ఆ ప్రాజెక్టులు కట్టడం లేదు 
రంగారెడ్డి–పాలమూరు, డిండి, ఆర్డీఎస్‌ ఆధునీక రణ, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిచ్చినా.. వాటికి తమ కాంట్రాక్టర్లు లేరని, కమీషన్లు రావని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టలేదు. మేం అధికారంలోకి వస్తే వాటిని పూర్తిచేస్తాం. రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర పథకాల పేర్లు మార్చి నిధులు దారి మళ్లించింది. సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా మన ఊరు–మనబడి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధాని ఫొటోలు తొలగించి కేసీఆర్‌వి వేసుకున్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకున్నావా కేసీఆర్‌.. సాయిగణేశ్‌ ఆత్మహత్య విష యంలో నిందితులను వదిలిపెట్టబోం. శిక్ష పడేలా చూస్తాం. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు పూర్తి అండదండగా నిలుస్తాం’’అని అమిత్‌ షా పేర్కొన్నారు.  

కేసీఆర్‌.. దమ్ముంటే నిరూపించు! 
► కేసీఆర్‌ ప్రభుత్వం చేయాల్సింది చేయకపోగా ప్రతీ దానికి మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తోంది. గత ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు వివిధ పథకాల ద్వారా రూ.2,52,202 కోట్ల నిధులు వచ్చాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, రింగు రోడ్లు, జాతీయ రహదారులు, మిషన్‌ భగీరథ పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చింది. దీనిపై కేసీఆర్‌ను సవాల్‌ చేస్తున్నా. దమ్ముంటే కాదని నిరూపించాలి. 

కుటుంబ పాలన.. అప్పుల ఊబి 
► నా 57 ఏళ్ల జీవితంలో ఇంతగా అవినీతిలో కూరుకుపోయిన, నియంతృత్వ సర్కారును చూడలేదు. అవినీతి, అక్రమాలు, నియంతృత్వ, కుటుంబ పాలనతో మొత్తం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసి.. ఇంకా కొత్త అప్పులు చేసేందుకు అనుమతి కోరుతున్నారు.

ఆ రిజర్వేషన్లు వారికి పంచుతాం 
► కేసీఆర్, టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం ఒవైసీల చేతిలో ఉంది. కేసీఆర్‌కు, ఎంఐఎంకు మేం భయపడబోం. ఈ తెలంగాణ నిజాంను తరిమికొడతాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేషన్లను రద్దుచేసి.. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచుతాం. 

ప్రతి కేజీ ధాన్యం కొంటాం 
► ధాన్యం కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ సర్కారు చేయడం లేదు. మేం రైతుల నుంచి ప్రతీ కేజీ బియ్యాన్ని, బాయిల్డ్‌ రైస్‌ను కొంటాం. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తాం. ఇది చెప్పడానికి, గుర్తు చేయడానికి నేను తెలంగాణకు వచ్చా. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తెచ్చేందుకు ప్రజలు సహకరించాలి.

ఇది టీఆర్‌ఎస్‌కు శ్రద్ధాంజలి సభ 
► కేసీఆర్‌ రేపే ఎన్నికలు పెట్టినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధం. మీ ఓటమి గోడపై రాతలా నిర్ణయమై పోయింది. బండి సంజయ్‌ యాత్ర.. కేసీఆర్‌ను పదవిలోంచి ఊడబెరికే యాత్ర. ఈ సభ బీజేపీ సభ కాదు.. తెలంగాణలో మార్పుకు సంకేతంగా నిలిచే ‘పరివర్తన ప్రచండ సభ’.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ శ్రద్ధాంజలి సభలా ఉంది.కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు బండి చాలు అన్నట్టుగా సభ ఉంది.

అమిత్‌ షాకు ఘన స్వాగతం 
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 3.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ, రాష్ట్ర నాయకులు డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘు నందన్‌రావు, రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే ఇం ద్రసేనారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. తర్వాత అమిత్‌ షా అక్కడి నుంచి రామంతాపూర్‌లోని నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు వెళ్లారు. 

ఆధునిక ల్యాబ్‌ ప్రారంభం 
టెక్నాలజీ యుగంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాల నియంత్రణకు తోడ్పడే ‘నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’ను అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్‌ క్యాంపస్‌లో కలియదిరిగి.. పరికరాలను పరిశీలించారు. ల్యాబ్‌ పనితీరు ఏంటి, డేటా అనాలిసిస్‌ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. 

సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు.. 
‘నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’2000వ సంవత్సరంలోనే హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. 2016లో కేంద్ర హోంశాఖ హైదరాబాద్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ విభాగాన్ని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీగా ప్రకటించడంతోపాటు ఐటీ యాక్ట్‌ 79(ఏ) కింద ‘ఎగ్జామినర్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌’గా నోటిఫై చేసింది. అంటే ఈ విభాగం వెలికితీసిన వివరాలు, విశ్లేషణలను సాక్ష్యాధారాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. ఈ క్రమంలోనే ల్యాబ్‌ను అత్యాధునిక టెక్నాలజీతో పూర్తిగా ఆధునీకరించారు. డిజిటల్‌ రికార్డ్స్‌ను వెలికితీయడం, నిక్షిప్తమైన సమాచారాన్ని లోతుగా విశ్లేషించడం కోసం ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేశారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న సైబర్‌ నేరాల నియంత్రణ కోసం రూ.35 కోట్లతో ఈ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను అభివృద్ధి చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇందులో మొబైల్‌ ఫోన్ల ఎగ్జామినేషన్‌ యూనిట్, డిజిటల్‌ స్టోరేజీ మీడియా ఎగ్జామినేషన్‌ యూనిట్, డేటా రిట్రీవ్, అనాలిసిస్‌ యూనిట్, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ ఫర్‌ డ్యామేజ్‌డ్‌ డేటా, చిప్, మాల్‌వేర్‌ అనాలిసిస్, క్రైమ్‌ సీన్‌ యూనిట్‌ ఉన్నాయని తెలిపింది. డిజిటల్‌ డేటాను వేగంగా వెలికితీయడంతోపాటు కచ్చితమైన విశ్లేషణ ఫలితాలను వెల్లడించడంలో ఈ యూనిట్‌ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొంది. 

సంజయ్‌.. గో ఎహెడ్‌! 
తుక్కుగూడ సభ అనంతరం ఢిల్లీ వెళ్లే ముందు బండి సంజయ్‌తో అమిత్‌షా విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర, సభను విజయవంతం చేసిన తీరును అభినందించినట్టు తెలిసింది. ‘‘నువ్వు ఏం మాట్లాడావో నాకు పూర్తిగా అర్థం కాలేదు. సభికుల్లో, ముఖ్యంగా యువకుల్లో మీ ప్రసంగానికి మంచి స్పందన కనిపించింది. రజాకార్ల గురించి, హిందువుల గురించి మాట్లాడినపుడు ఎక్కువ స్పందన వచ్చింది. తెలంగాణలో హిందూత్వ ఎజెండాతో మంచి ఫలితాలు వస్తాయని అనిపిస్తోంది. మిగతా రాష్ట్రమంతా పాదయాత్ర పూర్తి చేయండి. మీకు జాతీయ నాయకత్వం పూర్తి అండదండలు అందిస్తుంది..’’ అని అమిత్‌షా భరోసా ఇచ్చినట్టు తెలిసింది. సంజయ్‌ పాదయాత్ర టీమ్‌నూ అభినందించారు. 

సభ సక్సెస్‌.. కేడర్‌లో జోష్‌.. 
తుక్కుగూడలో అమిత్‌షా బహిరంగసభ పూర్తిగా విజయవంతమైందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సభకు భారీగా జనం హాజరవడం, అమిత్‌షా, ఇతర నేతల ప్రసంగాలకు మంచి స్పందన కనిపించడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ కనిపిస్తోందని అంటున్నాయి. సభకు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చిందని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును ఎండగట్టినపుడు, కేసీఆర్‌పై విమర్శలు చేసినప్పుడు జనం చప్పట్లు, కేరింతలతో స్పందించడం బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని చూపిస్తోందని నేతలు పేర్కొన్నారు. అంచనాలకు తగినట్టుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. 
– సభలో ‘బైబై కేసీఆర్‌’ అంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శించగా.. ఒక వృద్దుడు తలపై ప్టాస్టిక్‌ బుల్డోజర్‌ బొమ్మను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.  

మరిన్ని వార్తలు