‘మమతా సర్కార్‌పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు’

5 Nov, 2020 16:59 IST|Sakshi

మమతా సర్కార్‌పై నిప్పులు చెరిగిన అమిత్‌ షా

కోల్‌కతా : మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కేంద్రం హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందనివ్వకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రెండు రోజుల పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా గురువారం ఆయన బంకురా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మమతా సర్కార్‌పై అమిత్‌షా నిప్పులు చెరిగారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
(చదవండి : ఇవే నా చివరి ఎన్నికలు : నితీష్‌ కుమార్‌)

‘గత రాత్రి  నుంచి నేను పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాను. ఎక్కడికి వెళ్లినా మమతా సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాలనలో రాష్ట్రంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగాయి. కేంద్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను అందరికి అందనివ్వకుండా ఆమె అడ్డుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని  కుడా మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. పేదల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన  పథకాలను అడ్డుకోవడం ద్వారా బీజేపీని అడ్డుకోగలమని మమతా భావిస్తున్నారని, కానీ అది అసాధ్యమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి, నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం’అని అమిత్‌ షా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు