ఈశాన్యంలో అవినీతి సంస్కృతి అంతం

23 May, 2022 05:14 IST|Sakshi

హోం మంత్రి అమిత్‌ షా  

రాహుల్‌జీ.. ఇటలీ కళ్లద్దాలు కాదు.. ఇండియా కళ్లద్దాలు ధరించండి

అరుణాచల్‌లో అమిత్‌ షా పర్యటన

నామ్‌సాయ్‌(అరుణాచల్‌ ప్రదేశ్‌): ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి సంస్కృతిని బీజేపీ అంతం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పట్టడం లేదని, చివరి లబ్ధిదారుడి దాకా చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో నిధులు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు దారుణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. 

ఆయన ఆదివారం అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం, నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ(ఎన్‌డీయూ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అరుణాచల్‌ రాష్ట్రం ఈస్ట్‌ సియాంగ్‌ జిల్లాలోని పాసీఘాట్‌లో ఎన్‌డీయూ క్యాంపస్‌ ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం నామ్‌సాయ్‌ జిల్లాలో భారీ ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు.  ఈశాన్య భారతదేశానికి మోదీ సర్కారు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై అమిత్‌ షా మండిపడ్డారు.

కళ్లు మూసుకుంటే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ‘‘రాహుల్‌ గాంధీజీ.. మీరు కళ్లు తెరవండి. ఇటలీ కళ్లద్దాలను పక్కనపెట్టండి. ఇండియా కళ్లద్దాలు ధరించండి’’ అని అమిత్‌ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయని ఉద్ఘాటించారు.  ఇక్కడి ప్రజల్లో దేశభక్తి నిండిపోయిందని, ఒకరినొకరు ‘నమస్తే’ బదులు ‘జైహింద్‌’ అంటూ అభివాదం చేసుకుంటారని తెలిపారు. ఇలాంటి సన్నివేశం దేశంలో ఇంకెక్కడా చూడలేమన్నారు.

మరిన్ని వార్తలు