‘హౌ ఈజ్‌ కేసీఆర్‌?’ 

15 May, 2022 04:50 IST|Sakshi

కేసీఆర్‌ పాలన తీరు, అవినీతిపై అమిత్‌షా ఆరా 

నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ 

రాష్ట్రం చుట్టివచ్చేలా మోటర్‌సైకిల్, ఇతర యాత్రలు చేయాలని సూచన 

పార్టీ నేతలతో గంటా 45 నిమిషాల పాటు అమిత్‌షా భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. తుక్కుగూడ సభకు ముందు శంషాబాద్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘హౌ ఈజ్‌ కేసీఆర్‌..?’ అంటూ సీఎం కేసీఆర్‌ పాలన తీరు, అవినీతి ఆరోపణలు, టీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రాజెక్టులు, ఇతర అంశాల్లో అక్రమాల ఆరోపణలపై ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఈ సమయంలో ‘కేసీఆర్‌ అవినీతి కార్యకలాపాలపై ఏమైనా చేయాలి సార్‌..’ అని కొందరు నాయకులు ప్రస్తావించగా.. అమిత్‌షా స్పందనేది బయటపెట్టలేదని సమాచారం. తనకు పార్టీలో తగిన పని ఇవ్వడం లేదంటూ విజయశాంతి పేర్కొనగా.. అమిత్‌షా స్పందించలేదని తెలిసింది. ఈ సందర్భంగా సంజయ్‌ పాదయాత్ర వివరాలను అమిత్‌షా తెలుసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఎంతమేర కవర్‌ చేశారని ఆయన ప్రశ్నించగా.. నాలుగోవంతు వరకు పూర్తయిందని నేతలు సమాధానమిచ్చారు. దీంతో రాష్ట్రాన్ని త్వరితంగా చుట్టివచ్చేలా మోటర్‌సైకిల్, ఇతర రూపాల్లో యాత్రలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది. 

గంటా 45 నిమిషాలు భేటీ.. 
హైదరాబాద్‌లో మొదట ‘నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’ను ప్రారంభించిన అమిత్‌షా.. సాయంత్రం 5 గంటల సమయంలో నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో గంటా 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సీనియర్‌ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సుమారు 6.45 గంటల సమయంలో కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లతో కలిసి అమిత్‌షా తుక్కుగూడ సభకు బయలుదేరారు. 

టార్గెట్‌ 61: రఘునందన్‌రావు 
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 61 స్థానాలు గెలవడం, బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అమిత్‌షాతో తమ సమావేశం జరిగిందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. పార్టీ బలోపేతం, చేరికలు, మార్పులు, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనపై చర్చ జరిగిందన్నారు. త్వరలోనే చాలా మంది బీజేపీలో చేరుతారని పేర్కొన్నారు. 

దోపిడీ ముగిసే సమయం వచ్చింది: డీకే అరుణ 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ దోపిడీకి ముగింపు పలికే సమయం వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. కేటీఆర్, రేవంత్‌ల ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని.. కేంద్రం సహకరించకుంటే రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ఊసే ఎత్తలేదు! 
అమిత్‌షా సాయంత్రం 7.15 గంటలకు సభా వేదికపైకి వచ్చారు. అప్పటికే ఇతర నేతలంతా ప్రసంగించారు. తర్వాత కిషన్‌రెడ్డి, బండి సం జయ్, అమిత్‌షా మాట్లాడారు. రాత్రి 8.20 గం టల కల్లా సభ ముగిసింది. అయితే అమిత్‌షాగానీ, ఇతర బీజేపీ నేతలుగానీ పూర్తిగా టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై మాత్రమే విమర్శలు గుప్పిం చారు. మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామన్నది చెప్పారు. కానీ ఎవరూ పెద్దగా కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావన తేలేదు. విమర్శలేమీ చేయలేదు.   

మరిన్ని వార్తలు