సొంతంగానే ఎదుగుదాం 

16 Nov, 2021 03:56 IST|Sakshi
ధ్వజస్తంభానికి మొక్కుతున్న హోంమంత్రి అమిత్‌షా

రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ భేటీలో అమిత్‌ షా దిశా నిర్దేశం 

వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాం 

పార్టీలోకి చేరికలను ప్రోత్సహించండి.. చేరేవారిని గౌరవించండి 

ప్రజాబలం ఉన్నప్పుడు ఎవరూ ఎవరినీ ఆపలేరు 

టీడీపీ నుంచి చేరికలు ఆగడంపై సుజానా, సీఎం రమేష్‌ను ప్రశ్నించిన అమిత్‌ షా  

సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సొంతంగానే పార్టీ ఎదుగుదలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిశా నిర్దేశం చేశారు. సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. పార్టీ నేతలంతా సమష్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరికలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో పార్టీ బలపడే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పార్టీలో కొత్తగా చేరే నేతలకు సముచిత ప్రాధాన్యమిస్తూ తగినవిధంగా గౌరవించాలని సూచించారు. పొత్తుల గురించి ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని, మరెవరూ వీటిపై మాట్లాడొద్దని స్పష్టం చేశారు.

టీడీపీతో పొత్తు ఎందుకు ఉండకూడదని సుజనాచౌదరి, సీఎం రమేష్‌ గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన ఆయన సోమవారం రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరావతి ప్రాంతవాసుల పాదయాత్ర అంశాన్ని సమావేశంలో కొందరు నేతలు ప్రస్తావించగా ప్రజా ఉద్యమాలను సొంతంగానే చేపట్టి క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ సభ్యులుగా ఉన్న సీఎం  రమేష్, సుజనాచౌదరితో అంతకుముందు అమిత్‌  షా కొద్దిసేపు చర్చించారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఎందుకు తగ్గాయని భేటీలో అమిత్‌ షా ప్రశ్నించినట్లు తెలిసింది.  

ప్రజాబలం ఉంటే ఎవరూ ఆపలేరు.. 
తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ  అక్రమాలకు పాల్పడిందని కోర్‌ కమిటీ భేటీలో కొందరు నేతలు అమిత్‌ షా దృష్టికి తీసుకురాగా ప్రజాబలం ఉన్నప్పుడు ఎవరూ ఎవరినీ ఆపలేరని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తాజాగా తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాన్ని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలను మిగిలిన నేతలంతా గౌరవించాల్సిందేనని, బలహీనపరిచే చర్యలను సహించబోమని అమిత్‌ షా స్పష్టం చేశారు. సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేయాలని అమిత్‌ షా దిశానిర్దేశం చేశారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రగతికి కేంద్రం తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారన్నారు. పార్టీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్, కార్యదర్శి శివప్రకాష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌చార్జ్‌ సునీల్‌ థియోధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర పార్టీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

ముగిసిన పర్యటన.. 
మూడు రోజుల రాష్ట్ర పర్యటన ముగించుకుని అమిత్‌ షా సోమవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, డీజీపీ గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ తదితరులు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీడ్కోలు పలికారు. 

శ్రీకపిలేశ్వరస్వామిని దర్శించుకున్న అమిత్‌ షా 
తిరుపతి కల్చరల్‌: అమిత్‌ షా సోమవారం మధ్యాహ్నం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అమిత్‌ షా శ్రీవినాయకస్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభానికి నమస్కరించారు. శ్రీకపిలేశ్వరస్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీకామాక్షి అమ్మవారిని, శ్రీగురుదక్షిణామూర్తిస్వామి వారిని, శ్రీసుబ్రహ్మణ్యస్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత చండీహోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, టీటీడీ ముద్రించిన రూట్స్‌ పుస్తకం, శ్రీవారి ప్రతిమను టీటీడీ చైర్మన్, ఈవో అందజేశారు.   

మరిన్ని వార్తలు