అదే బీజేపీ లక్ష్యం.. అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు

31 Mar, 2022 06:37 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ఎప్పుడూ హింసను నమ్ముకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ‘సిద్ధాంత ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుస్తున్నా. నాయకత్వానికున్న జనాదరణ, ప్రభుత్వ పనితీరు, పథకాల ఆధారంగా ఓట్లు అడుగుతాం తప్ప ప్రత్యర్థులపై హింసకు దిగడం బీజేపీ విధానం కాదు’ అన్నారు. లోక్‌సభలో ఓ చర్చకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను చంపడం, భార్యాపిల్లలపై అత్యాచారాలకు ఒడిగట్టడం, హత్యా రాజకీయాలు చేయడం బీజేపీ సంస్కృతి కాదని తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏళ్ల తరబడి అంతర్గత ఎన్నికల ఊసే ఎత్తకుండా కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలకు అలవాటని ధ్వజమెత్తారు. ముందుగా వాళ్ల పార్టీలో ఎన్నికలు జరుపుకుని ఆ తర్వాత దేశం గురించి మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్నది బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతకు ముందు.. బీర్భూం హత్యాకాండపై సీబీఐ చేస్తున్న దర్యాప్తులో నిజ నిర్ధారణ కమిటీ ముసుగులో బీజేపీ వేలు పెడుతోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధశారం ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లందరినీ జైలుపాలు చేయాలన్న అజెండా దేశవ్యాప్తంగా నడుస్తోందని విమర్శించారు. తృణమూల్, పోలీసుల కుమ్మక్కుతో రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించిన నివేదికలో కమిటీ ఆరోపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని సూచించింది. దీనిపై మమత మండిపడ్డారు.

మరిన్ని వార్తలు