21న మునుగోడుకు అమిత్‌ షా: తరుణ్‌చుగ్‌

18 Aug, 2022 02:13 IST|Sakshi

కేసీఆర్‌ నిరంకుశ పాలనకు అమిత్‌ షా సభతో విముక్తి అని వ్యాఖ్య

మునుగోడు సభలో బీజేపీలో చేరనున్న రాజగోపాల్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఈ సభ వేదికగా బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ వెల్లడించారు. అదే సమయంలో పార్టీ కార్యాచరణను కూడా అమిత్‌షా ప్రకటిస్తా రని తెలిపారు.

బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్‌ చుగ్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాన శత్రువు అవినీతి, కుటుంబ రాజకీయాలని విమర్శించారు. అవినీతి గురించి మాట్లాడితే కేసీఆర్‌కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. దేశంలో ఇందిరా గాంధీ నియంతృత్వం ముగిసినట్టుగానే తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ముగింపు వస్తుందన్నారు.

అమిత్‌షా సభతో తెలంగాణకు కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కొంతకాలం నుంచి అధికారం చేజారిపోతుందన్న ఆందోళనలో కేసీఆర్‌ ఉన్నారని, అందుకే బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రపై కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. 21న మునుగోడు సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరనున్నారని తెలిపారు.

దూకుడు పెంచిన బీజేపీ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో దూకుడు పెంచిన బీజేపీ పెద్ద సంఖ్యలో చేరికలకు రంగం సిద్ధం చేసుకుంది. 21న అమిత్‌షా సభ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి తేజావత్‌ రామచంద్రు నాయక్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, నర్సాపూర్‌ మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ మురళీయాదవ్, పలు వురు మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరనున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి.

ఇక బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర–3 ముగింపు సందర్భంగా ఈ నెల 27న హనుమకొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గానీ ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ సభలో మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీలో చేరుతారని అంటున్నాయి.

అమిత్‌షా షెడ్యూల్‌ ఇదీ
ఈ నెల 21న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అమిత్‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు వస్తారు. కొంతసేపు సీఆర్పీఎఫ్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత మునుగోడు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి, అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.   

ఇది కూడా చదవండి: మునుగోడుపై స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. రేవంత్‌ లేకుండా వరుస భేటీలు

మరిన్ని వార్తలు