గ్రేటర్‌ పోరు.. రంగంలోకి అమిత్‌ షా

24 Nov, 2020 11:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది. అధికార పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తుండగా.. గల్లీల్లో మంత్రులు తిష్టవేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సోమవారం జరిగిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్‌ వాసులపై వరాల జల్లు కురిపించారు.

రంగంలోకి కాషాయదళం
ఇక తామేమీ తక్కువ కాదన్నట్లు బీజేపీ సైతం అగ్రనేతలను బరిలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌లో వాలిపోయారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రేటర్‌ పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్న కాషాయదళం దానికి అనుగుణంగానే ఓటర్లను ఆకర్శిస్తోంది. దీనిలో భాగంగానే జాతీయ స్థాయిలోని నేతలను రంగంలోకి దింపుతోంది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం అగ్ర నేతల పర్యటనను సంబంధిం షెడ్యూల్‌ విడుదల కానుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ఇప్పటికే నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

అసెంబ్లీపై గురి..
మరో మూడేళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎ‍న్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గ్రేటర్‌ పోరులో ప్రభావం చూపిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావొచ్చని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే అగ్రనేతలను సైతం రంగంలోకి దింపుతోంది. దుబ్బాక విజయంతో మంచి దూకుడు మీద ఉన్న కమలదళానికి కారు పార్టీ ఏ విధంగా బ్రేకులు వేస్తోందో వేచి చూడాలి. కాగా 150 డివిజన్‌లు ఉన్న గ్రేటర్‌ జీహెచ్‌ఎంసీలో డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుంది. 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
 

మరిన్ని వార్తలు