ముస్లిం మైనార్టీలపై బాబు మొసలి కన్నీరు

24 Nov, 2022 05:12 IST|Sakshi

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ధ్వజం

కడప రూరల్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజద్‌ బాçషా ధ్వజమెత్తారు. బుధవారం కడపలోని వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కపట రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ లాంటి చంద్రబాబు అభద్రతా భావంతో లాస్ట్‌ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ వేడుకుంటున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు హయాంలో మైనార్టీలు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్క చంద్రబాబు పాలనలోనే మైనార్టీలకు మంత్రి పదవి దక్కలేదని, మరి ఆనాడు  రామోజీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రన్న తోఫాలంటూ హెరిటేజ్‌లో బూజుపట్టిన బెల్లం అంటగట్టి గొప్పలు చెప్పుకున్నారన్నారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనార్టీల కోసం కేవలం రూ.2,665 కోట్లు ఇవ్వగా మూడున్నరేళ్లలో సీఎం జగన్‌ రూ.20 వేల కోట్లకు పైగా వెచ్చించారని తెలిపారు. డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.10,020 కోట్లు మైనార్టీలకు అందించారన్నారు. కోవిడ్‌ సమయంలో రూ. 81 కోట్లు మైనార్టీల ఖాతాల్లోకి పంపిన ప్రభుత్వం తమదేనన్నారు.

ఇమామ్, మౌజన్ల విషయంలో సీఎం జగన్‌ గొప్ప నిర్ణయం తీసుకుని ప్రతినెల గౌరవ వేతనం అందిస్తున్నారన్నారు.  నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలుగా, మండలిలో మరో నలుగురికి అవకాశం కల్పించారన్నారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించడంతోపాటు చట్టం చేసి పూర్వ వైభవాన్ని కల్పించారన్నారు.

ఒక్కసారి మేలు చేస్తే జీవితాంతం గుర్తుంచుకునే వర్గాలు ముస్లిం మైనార్టీలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు జహీర్, షఫీ, అజ్మతుల్లా, సుబ్బారెడ్డి, సుభాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు