నోయిడా ట్విన్ టవర్స్‌- ఏపీ ప్రజావేదిక.. రెండూ కరెక్టేనా!

5 Sep, 2022 13:14 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వద్ద రెండు భారీ ట్విన్ టవర్స్‌ను కూల్చివేసిన ఘట్టం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సుమారు నలభై అంతస్తుల భవనాన్ని కేవలం తొమ్మిది సెకన్లలోనే కూల్చేవేయడం ఒక ముఖ్యమైన అంశం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మరో ప్రధాన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక ఈ ఆదేశాలు వివాదాస్పదం కాలేదు. రాజకీయ పార్టీలు దీనిపై విమర్శలకు దిగలేదు. అక్రమ భవనం అని కోర్టు నిర్థారించింది. అంతకు ముందు గత ఏడాది కేరళలోని కొచ్చి వద్ద నదీతీర ప్రాంతంలో నిర్మించిన మరో భారీ బహుళ అంతస్తుల భవంతిని కూడా సుప్రీం ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. ఈ ఘట్టాలు దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చాయనే చెప్పాలి.
చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం?

తాత్కాలికంగా కొంతమంది వ్యక్తులకు ఈ పరిణామం అసౌకర్యం కలిగించినా, భవిష్యత్తులో బిల్డర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడడకుండా ఉండడానికి ఇది ఆస్కారం ఇస్తుంది. విశేషం ఏమిటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్రమ సౌధం నేలకూలింది అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే మాత్రం విధ్వంసం అని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురదచల్లే యత్నం చేశాయి. విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో కృష్ణా కరకట్టను ఆనుకుని పలు భవనాలు వెలిశాయి.

అవన్ని కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించినవే. ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఏకంగా ప్రజావేదిక పేరుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ఒక అక్రమ నిర్మాణం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అధికారులు వద్దని సలహా ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నదీని అనుకుని ఎలాంటి నిర్మాణాలు జరగరాదు. దానికి నిర్దిష్టదూరంలోనే నిర్మాణాలు ఉండాలి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

చివరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబే  స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో బస చేశారు. కొందరు పర్యావరణ వేత్తలు వచ్చి దీనిపై అభ్యంతరం చెప్పినా, వారిపై నిర్భంధాలు విధించారే కాని, చేసిన తప్పును సరిదిద్దుకోలేదు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు, లింగమనేని రమేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన అతిథి గృహ భవనంలో మకాం చేశారు. దీనికి ప్రతిగా ఆయనకు రాజధాని భూముల పూలింగ్‌లో మినహాయింపులు ఇచ్చి లాభం చేశారన్న అభియోగం ఉంది. అది వేరే విషయం.

చంద్రబాబు ఈ ఇంటిలో దిగడానికి కొన్ని నెలల ముందు ఆయన క్యాబినెట్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో వరదను పరిశీలించడానికి వెళ్లి, ఈ అక్రమ నిర్మాణాలను గమనించి వీటన్నిటిని తమ ప్రభుత్వం కూల్చివేస్తుందని అప్పట్లో ప్రకటించారు. తీరా సీన్ కట్ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టీడీపీ అధినేతే అలాంటి అక్రమ భవనం ఒకదానిలో దిగేసరికి ఉమా కూడా సైలెంట్ అయిపోయారు. తన ఇంటి వద్ద సదుపాయంగా ఉంటుందని భావించి ప్రజావేదిక పేరుతో ఒక కన్వెన్షన్ హాల్ తరహాలో నిర్మించుకున్నారు. 2019లో టీడీపీని ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజావేదికలో ఒక సదస్సు పెట్టి, ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించి దానిని కూల్చివేయాలని ఆదేశించారు.

అంతే: చంద్రబాబుతో సహా, పలువురు టీడీపీ నేతలు, వారికి వంత పాడే మరికొన్ని ఇతర పార్టీల నేతలు ఇంకేముంది విధ్వంసం అంటూ ప్రచారం చేశారు. ప్రజావేదిక కూల్చి ఏడాది అయిందంటూ మరోసారి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇదొక్కటే కాదు. ఏపీలో ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా, చివరికి అది గోడ అయినా, దానిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనో టీడీపీ వారు అడ్డుకోవడం, వెంటనే స్టేలు తీసుకు రావడం చేశారు. చిత్రంగా గౌరవ హైకోర్టు వారు కూడా కారణం తెలియదు కాని, అలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎక్కువ సందర్భాలలో స్టే ఇచ్చారన్న అభిప్రాయం ఉంది.

కృష్ణా కరకట్టపై ఉన్న భవనాలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా,  కొందరు  హైకోర్టు నుంచి స్టే పొందగలిగారు. చివరికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నీటిపారుదల శాఖ స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరిగోడను కూల్చినా టీడీపీ మీడియా, టీడీపీ నేతలు రచ్చ,రచ్చ చేశారు. న్యాయ స్థానం నుంచి కూడా వారికి కొంత సానుకూలమైన ఆదేశాలు వచ్చాయి. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి గోడ కట్టిన గీతం యూనివర్శిటీలో ఆ గోడను తొలగించినప్పుడు కూడా ఇదే తంతు.  కాని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నోయిడాలో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలను కూల్చివేయించారు.

ఈ కూల్చివేతకు సుమారు ఇరవై కోట్ల వ్యయం అయిందని వార్తలు వచ్చాయి. ఈ భవనాలను నిర్మించిన బిల్డర్లు తమకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. అంత ఖరీదైన భవనాల నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కాని కొందరు మాత్రం ఇలా కూల్చడం కన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే బాగుండేదన్న వాదనను తీసుకు వస్తున్నారు. సుప్రీంకోర్టే ఆ పని చేస్తే, ఇక ప్రభుత్వాలు దానిని మరింతగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతివాదన చేసేవారు అంటున్నారు. కూల్చివేత ఘట్టం పూర్తి అయ్యాక, ఈ వాద, ప్రతివాదాలకు పెద్దగా విలువ ఉండదు. మరికొన్ని ఘట్టాలు కూడా గుర్తు చేసుకోవాలి.

ఉత్తరప్రదేశ్‌లో అఘాయిత్యాలకు పాల్పడిన రౌడీషీటర్ల ఇళ్లను, మతకలహాలకు కారకులైనవారి ఇళ్లను అవి అక్రమమైనవి అయితే బుల్ డోజర్‌లు తీసుకు వెళ్లి కూల్చివేశారు. దానిని సుప్రీంకోర్టు కూడా నిలువరించలేదు. దాంతో యూపీ ప్రభుత్వానికి బుల్ డోజర్ ప్రభుత్వం అన్న పేరు కూడా కొంతమంది పెట్టారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో వరదనీరు, డ్రైనేజీ వ్యవస్థ పారే నాలాల మీద ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూల్చలేదని న్యాయస్థానం ఒక సందర్భంలో ప్రశ్నించింది. దాంతో అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపుతూ ఆ ఇళ్లను పలు చోట్ల కూల్చివేశారు.

బాచుపల్లి అనే చోట అనుమతులు లేకుండా నిర్మించిన 200 పైగా విల్లాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయినా ఇక్కడ ఎవరూ దానిని విధ్వంసంగా అభివర్ణించలేదు. ఏపీలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ,దానికి వంతపాడే ఈనాడు, తదితర  మీడియా మాత్రం ఆ తరహా ప్రచారం చేశాయి. నొయిడా ఘటన తర్వాత కూడా ప్రజా వేదికను తీసివేసిన విషయాన్ని విధ్వంసంగానే ప్రచారం చేస్తారా? ఏపీకి సపరేట్ రాజ్యాంగం ఉందని వారు భావిస్తారా?. కృష్ణానది అనుకుని ఉన్న విలాసవంత భవనాల ద్వారా కాలుష్యం నదిలో కలుస్తోందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా ఏపీ వరకు మినహాయింపు ఇవ్వాలని వీరు అభిలషిస్తారా? ఈ మొత్తం ప్రకియలో టీడీపీ, అనుబంధ మీడియా ఆత్మరక్షణలో పడినట్లయింది.

సుప్రీం కోర్టు చేసింది విధ్వంసమా?లేక నిబంధనలు పాటించడమా అన్నదానిపై వీరు నోరు విప్పలేని పరిస్థితి. అయితే కొన్నాళ్లకు అంతా మర్చిపోయారని అనుకున్న తదుపరి యథా ప్రకారం టీడీపీ కాని, వారి మీడియా కాని విధ్వంసపు రాతలు రాయకుండా ఉంటాయని భావించలేం. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే రామోజీరావు తదితర మీడియా సంస్థల యజమానులు తామే ఓడిపోయామని ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును గద్దె ఎక్కించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చన్నది వారి ఆలోచన. ఇందు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా జగన్ వీటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్‌దే కరెక్టు అని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాల ద్వారా తేలిందని అనుకోవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు