నితీష్‌కు చిరాగ్‌ చికాకు!

12 Nov, 2020 16:52 IST|Sakshi

పట్నా : గత ఏడాది జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన సీనియర్‌ నేత సరయూ రాయ్‌ ఏకంగా సీఎం రఘువర్‌దాస్‌పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్‌ తరహాలో బిహార్‌లో చిరాగ్‌ పాశ్వాన్‌ నితీష్‌ కుమార్‌కు చుక్కలు చూపారు. చిరాగ్‌ పాశ్వాన్‌ కారణంగానే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్‌దాస్‌తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్‌ కుమార్‌కు ఊరట ఇస్తోంది.

చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్‌ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్‌ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్‌ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్‌ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్‌ పాశ్వాన్‌ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 

మరిన్ని వార్తలు