టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్‌     

11 Jan, 2023 16:26 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలో చేరిన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు   

పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): టీడీపీ కంచుకోట నరసాపురంలో జేసీ బ్రదర్స్‌ (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)కు గట్టి షాక్‌ తగిలింది. వారి ప్రధాన అనుచరుడైన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు దాదాపు 160 కుటుంబాల వారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి నేతృత్వంలో వీరంతా మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ మారడం టీడీపీ కంచుకోటకు బీటలు బారినట్లయ్యింది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ సీఎం జగన్‌ పాలన సాగిస్తుండటంతో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్రకౌన్సిల్‌ సభ్యుడు వేమనాథరెడ్డి, ఎంపీపీ రామ్మూర్తిరెడ్డి, వైస్‌ ఎంపీపీ రామిరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు హాజీవలి, మండల యూత్‌ కన్వీనర్‌ కమలాకర్‌రెడ్డి, పార్లమెంటు జనరల్‌ సెక్రటరీ రవిప్రసాద్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు చిక్కేపల్లి రామేశ్వర్‌రెడ్డి, ముచ్చుకోట అమర్‌నాథరెడ్డి, నరసాపురం రామచంద్ర (కాశీ), ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు