అదే జరిగితే కర్నూలుకు హైకోర్టు రావడం తథ్యం!

6 Dec, 2022 21:26 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తను చేపట్టిన సంక్షేమ పథకాల బలంతో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తుంటే, దానిని అడ్డుకుని, అసలేమీ జరగడం లేదేమో అన్న భావాన్ని ప్రజలలో కల్పించడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇరు పక్షాలు పోటాపోటీ యాత్రలు, సభలు నిర్వహిస్తున్నాయి. 

కర్నూలులో న్యాయ రాజదాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో రాయలసీమ ప్రాంతం అంతా ఉంది. అదేమీ లేదని ప్రజలను మభ్య పెట్టడానికి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రధాన వీధులలో జనసమీకరణ చేసి, బ్రహ్మాండంగా జనం వచ్చేశారని భ్రమింప చేయాలని ఆయన యత్నించారు. ఆ తర్వాత ఆయనకు బాజా వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని మీడియా సంస్థలు అబ్బో ఎంత జనమో అంటూ ఊదరగొట్టాయి. పరిస్థితి అంతా మారిపోయిందా అన్న చందంగా టిడిపి ప్రచారం చేసింది. 

అయితే అక్కడ టిడిపి అధినేతకు ప్రజల నుంచి ముఖ్యంగా లాయర్ల నుంచి హైకోర్టుపై ప్రశ్నల వర్షం కురిసింది. నిరసనలు వెల్లువెత్తాయి. కర్నూలులో హైకోర్టు వద్దనలేక, అవునని అనలేక చంద్రబాబు సతమతమై, తాను కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని భావించానని చెప్పారు. నిజానికి అలాంటి ప్రతిపాదన ఏదీ ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో కేంద్రానికి పంపించలేదు. మొత్తం మీద కర్నూలులో తేనెతుట్టె కదల్చినట్లు చేశారు. అసలే అక్కడ ప్రజలు తమకు న్యాయ రాజధాని అంటే హైకోర్టు తదితర సంబంధిత విభాగాలు రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారని బాదపడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వెళ్లి కర్నూలుకు అది అవసరం లేదన్నట్లుగా మాట్లాడారన్న అభిప్రాయం కలిగింది. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు యాత్ర తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్, జేఏసీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సీమ గర్జన పేరుతో న్యాయరాజధాని కోసం సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి దానిని సక్సెస్ చేశారు. ఈ సభకు వ్యతిరేకంగా ఈనాడు, తదితర పత్రికలు కొంత ప్రచారం చేయకపోలేదు. బలవంతంగా విద్యార్థులను తీసుకు వెళ్తున్నారని, బస్‌లు తిప్పుతున్నారని ఇలా ఏవేవో కధనాలు ప్రచారం చేశాయి.  

చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష అని, నవనిర్మాణ దీక్ష అంటూ ఆయా చోట్ల ప్రభుత్వపరంగా సభలు పెట్టినప్పుడు జనాన్ని ఎలా మళ్లించింది అందరికి తెలిసినా, ఈ పత్రికలు మాత్రం కళ్లు మూసుకున్నాయి. పోలవరం, అమరావతి సందర్శన అంటూ కోట్ల రూపాయలతో బస్‌లలో జనాన్ని అప్పట్లో తరలించినా, అదంతా గొప్ప విషయంగా కనిపించేది. అది వేరే విషయం. 

న్యాయ రాజధానిని శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం చేయాలన్నది సీమ ప్రాంతవాసుల కోరిక. ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న మాట నిజం. అప్పట్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాతకాలంలో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడి అన్నీ హైదరాబాద్‌కు తరలివెళ్లాయి. తిరిగి 2014లో తెలంగాణ విడిపోయాక, యధాప్రకారం ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవహారంతో పాటు, మొత్తం రాజధాని ఎలా ఉండాలన్నదానిపై నిపుణుల కమిటీలు వేశారు. అప్పటికే శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు ఉన్నాయి. ఇవన్నీ రాజధాని వికేంద్రీకరణకు అనుకూలగా ఉండటంతో జగన్ వికేంద్రీకరణకు మద్దతుగా నిర్ణయం చేశారు. కానీ అది వివిధ కారణాల వల్ల ఇంకా అమలు కాలేదు. అందుకు టిడిపి అడ్డు తగలడమే ప్రధాన హేతువు అన్న సంగతి తెలిసిందే. 

తాజాగా మారిన పరిణామాలలో సుప్రీంకోర్టు నుంచి ఐదు అంశాలలో ప్రభుత్వానికి అనుకూలంగా స్టే రావడంతో ప్రభుత్వ వర్గంలో నమ్మకం పెరిగింది. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కర్నూలు జగన్నాధగుట్టలో హైకోర్టు వస్తుందని ప్రకటించారు. ఇది ఒక అడుగు ముందుకు వేయడమే అవుతుంది. ఈ గర్జన సభ సక్సెస్ అవడం టిడిపికి మింగుడు పడని అంశమే. అసలే రాయలసీమలో టిడిపి బాగా బలహీనంగా ఉంటే, ఇప్పుడు ఈ హైకోర్టు ఉద్యమం ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టింది. కర్నూలు హైకోర్టు డిమాండ్‌కు బిజెపి, సిపిఎం వంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కాదనలేని స్థితి. సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావచ్చన్నది ఎక్కువమంది విశ్వాసం. అలా జరిగితే ఆ తర్వాత కర్నూలుకు హైకోర్టు రావడం తథ్యమన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకే బుగ్గన ధైర్యంగా  కర్నూలులో ఫలానా చోట హైకోర్టు వస్తుందని ప్రకటించి ఉండాలి.

- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు