అనిల్‌ దేశ్‌ముఖ్‌ 2 కోట్లు అడిగారు

8 Apr, 2021 10:53 IST|Sakshi

మంత్రి పరబ్‌ కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేయమన్నారు

ముంబై పోలీస్‌ మాజీ అధికారి వాజే ఆరోపణలు

ఎన్‌ఐఏ కోర్టు జడ్జీకి లేఖ అందించేందుకు యత్నం

సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రిపై పోలీస్ అధికారి పరమ్‌బీర్ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది.  ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తనకు తిరిగి పోస్టింగ్‌ ఇచ్చేందుకు రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారని సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే ఆరోపించారు. మరో మంత్రి అనిల్‌ పరబ్‌ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు. ఈమేరకు ఆరోపణలతో స్వయంగా రాసిన లేఖను బుధవారం ఎన్‌ఐఏ కోర్టుకు హాజరైన సమయంలో అందజేసేందుకు యత్నించగా జడ్జీ నిరాకరించారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తనపై మళ్లీ సస్పెన్షన్‌ వేటు వేయాలని ప్రయత్నించారని వాజే ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, పవార్‌ను ఒప్పించే పూచీ తనదని అప్పటి హోం మంత్రి దేశ్‌ముఖ్‌..అందుకు గాను రూ.2 కోట్లు ఇవ్వాలని షరతు పెట్టారని తెలిపారు.

అంత డబ్బు ఇవ్వలేనని అశక్తత వ్యక్తం చేయగా తరువాత ఇవ్వాలని దేశ్‌ముఖ్‌ కోరారన్నారు. సయిఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ కేసు విచారణను మూసివేసేందుకు రూ.50 కోట్లు ఆ ట్రస్టు సభ్యుల నుంచి వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టగా అటువంటి పనులను చేయలేనని తప్పుకున్నట్లు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలున్న 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని మరో మంత్రి అనిల్‌ పరబ్‌ తనను కోరారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను రవాణా శాఖ మంత్రి పరబ్‌ ఖండించారు.

తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముంబై ఉన్న సుమారు 650 బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు వసూలు చేయాలని మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని అప్పటి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు కూడా తెలిపానన్నారు. రాష్ట్రంలోని గుట్కా, పొగాకు అక్రమ వ్యాపారుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ కేబినెట్‌లో సీనియర్‌ మంత్రి సన్నిహితుడినంటూ దర్శన్‌ ఘోడావత్‌ అనే వ్యక్తి సంప్రదించగా నిరాకరించినట్లు తెలిపారు. 

చదవండి: సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

పరంబీర్‌ ఆదేశాల మేరకే వాజేకు పోస్టింగ్‌
సస్పెండైన వివాదాస్పద పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేను గత ఏడాది జూన్‌లో అప్పటి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆదేశాల మేరకే క్రైం ఇంటెలిజెంట్‌ యూనిట్‌(సీఐయూ)లోకి తిరిగి తీసుకున్నట్లు ముంబై పోలీస్‌ శాఖ మహారాష్ట్ర హోం శాఖకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ విషయంలో అప్పటి జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌(క్రైం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. విధి నిర్వహణలో సచిన్‌ వాజే నేరుగా అప్పటి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌కే నేరుగా రిపోర్టు చేసేవారని తెలిపింది. కీలక కేసులపై జరిగే మంత్రివర్గ స్థాయిలో జరిగే సమావేశాల్లో సీపీతోపాటు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారికి బదులుగా అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉన్న వాజే పాల్గొనేవారని వివరించింది. కీలక కేసుల విచారణలో పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ సూచనల మేరకు వాజే నిర్ణయాలు తీసుకునే వారని వెల్లడించింది.

వాజేను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి
మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసులో ముంబై పోలీస్‌ మాజీ అధికారి సచిన్‌ వాజేను విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతికి పాల్పడ్డారంటూ ముంబై పోలీస్‌ మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అంద జేయాలన్న ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. పరంబీర్‌ సింగ్‌ ఆరోపణలపై కేసు నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న వాజేను ప్రశ్నించేందుకు అనుమతి వ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పీఆర్‌ సిత్రే సీబీఐకి అనుమతించడంతోపాటు వాజే కస్టడీని ఈనెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. 

చదవండి: ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు