పోలవరం ఎత్తు మిల్లీ మీటర్‌ కూడా తగ్గించం

3 Dec, 2020 04:59 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌

వచ్చే ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి

2022 ఖరీఫ్‌కు రెండు కాల్వల ద్వారా నీళ్లు 

2014 అంచనాలకు కట్టుబడి ఉంటామని మీరు లేఖ రాయలేదా? 

ప్యాకేజీ కోసం అమ్ముడుపోయిన చరిత్ర బాబుదే: అసెంబ్లీలో మంత్రి అనిల్‌ 

సాక్షి, అమరావతి: పోలవరం ఎత్తును మిల్లీ మీటర్‌ కూడా తగ్గించబోమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2022 ఖరీఫ్‌కు రెండు కాల్వల ద్వారా సాగునీరు అందిస్తామని ప్రకటించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ తెలుగుదేశం పార్టీ తన హయాంలో ఏమీ చేయకపోగా, ఇప్పుడు అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమని, దానికి పచ్చ మీడియా వండి వడ్డించడం శోచనీయమని మండిపడ్డారు. శాసనసభలో బుధవారం పోలవరంపై జరిగిన చర్చలో వాస్తవ పరిస్థితిని ఆయన సుదీర్ఘంగా వివరించారు. ‘చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేసి, పూర్తి చేశారా? పట్టిసీమ గురించి పదేపదే చెప్పడం, పోలవరాన్ని 70 శాతం పూర్తి చేశామని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. పోలవరం కుడి కాల్వను వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, ఆ కాల్వ ద్వారా నీళ్లిచ్చి, తన ఘనతగా చెప్పుకోవడం ఏమిటి?’ అని మండిపడ్డారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..  

మీరు చేసిన తప్పుల్ని కడుక్కుంటున్నాం  
► పోలవరం అంచనా వ్యయం విషయంలో మీరు చేసిన తప్పులను కష్టపడి కడుక్కుంటున్నాం. పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్‌ అంచనాల ప్రకారం నిధులు ఇస్తే చాలని మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? లేదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే మీకు పోలవరం నిర్మాణ వ్యయం పెరుగుతుందని తెలియదా?  
► 1999 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గురించి కనీసం ఆలోచించలేదెందుకు? 2004 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరానికి శంకుస్థాపన చేసి చకచకా పనులు చేశారు.  2014 నుంచి పోలవరం ప్రాజెక్టు విషయంలో మీ కంట్రిబ్యూషన్‌ ఎంత? రివైజ్డ్‌ అంచనాలను ఎందుకు తయారు చేయించలేదు? మీరు 2017లో ఎమ్యూనరేషన్‌ జరిపించి సవరించిన అంచనాలతో ప్రతిపాదనలు సమరి్పస్తే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా?  కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును ప్యాకేజీల కోసం రాష్ట్రమే నిర్మిస్తుందని బాధ్యతలు తీసుకున్నది వాస్తవం కాదా? కేంద్రం స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటిస్తే.. సంబరాలు చేసుకోలేదా? అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే గొంతు నొక్కారు.  2014 అంచనాల ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని 2017లో కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానంలో మీ పార్టీ మంత్రులు ఉన్న విషయం వాస్తవం కాదా?  
► వాస్తవాలు మాట్లాడితే విచక్షణ కోల్పోవడం, బెదిరించడం, ఊగిపోవడం ఎందుకు? మీరు బెదిరిస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరు. 

ప్రాజెక్టు పనులు పరుగులు 
► మేము అధికారంలోకి వచ్చాక పోలవరంపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి రూ.800 కోట్లు ఆదా చేశాం. కోవిడ్‌ సమయంలో కూడా ప్రాజెక్టు పనులను పరుగులు తీయిస్తున్నాం. ఒక్క మిల్లీ మీటర్‌ కూడా ఎత్తు తగ్గించం. కావాలంటే కొలుచుకోండి. (టేపు విపక్షానికి పంపారు). చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే వ్యాఖ్యానించారు. పోలవరం పర్యటనలకు చంద్రబాబు రూ.100 కోట్లు అప్పనంగా ఖర్చు చేశారు.  
► గత టీడీపీ ప్రభుత్వం కాఫర్‌ డ్యామ్‌ సగం కట్టి మభ్యపెట్టింది. వారి నిర్వాకం వల్ల 18 వేల గిరిజన, ఎస్సీ, బీసీల ఇళ్లు నీట మునిగాయి. నష్టపోయిన వారికి చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మేము డ్యామ్‌ కట్టే లోపే 17 వేల కుటుంబాలకు పునరావాసం కల్పిస్తాం. 
► కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ రాయడంతో నిధులు వస్తున్నాయి. డ్యామ్‌తో పాటు ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.29 వేల కోట్లు కూడా వస్తాయి. పోలవరం పూర్తి చేసి తీరతాం. ప్రారంభోత్సవానికి కుప్పం ఎమ్మెల్యేగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం. నాకు టీఎంసీలు, క్యూసెక్కులకు తేడా తెలియదని టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అంటున్నారు. తేడా ఏమిటో చెబుతాను. అయితే మీ పదవికి రాజీనామా చేస్తారా? చాలెంజ్‌.   

మరిన్ని వార్తలు