కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు అజెండా

17 Jan, 2021 03:47 IST|Sakshi

జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌ కుమార్‌ మండిపాటు

9 ఆలయాల ఘటనల్లో తమ పార్టీ కార్యకర్తలు లేరని టీడీపీ, బీజేపీ నేతలు చెప్పగలరా?

టీడీపీని బతికించుకునేందుకే ఆలయాలపై దాడులు, దుశ్చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవాలయాల ఘటనల వెనుక దురుద్దేశం కనిపిస్తోందని, పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైందని జల వనరుల శాఖా మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి, తద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నేత చంద్రబాబు అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పైకి నుదుట బొట్టు.. లోపల కులాలు, మతాల మధ్య చిచ్చు.. ఇదే చంద్రబాబు అజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో ఘటనల గురించి డీజీపీ వెల్లడిస్తే చంద్రబాబు, ఆయన తనయుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

టీడీపీ ఉనికి పాట్లు
► తమ ఉనికి కోల్పోతున్నామని టీడీపీ నేతల్లో భయం మొదలైంది. 9 ఆలయాల ఘటనల్లో ఉన్న వారు తమ పార్టీ కార్యకర్తలు కాదని టీడీపీ, బీజేపీ నేతలు చెప్పగలరా?  
► ఇటీవల దేవాలయాలపై దాడులకు సంబంధించి పోలీసులు 29 కేసులను ఛేదించి, 80 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఛేదించిన 9 కేసులలో రాజకీయ పార్టీలకు చెందిన వారి హస్తం ఉందని డీజీపీ స్పష్టంగా చెప్పారు.
► ఈ దాడుల్లో టీడీపీ బండారం బయట పడుతోందని నారా వారి నరాల్లో వణుకు పుట్టుకొస్తోంది. ఆ పార్టీ నేతల మాటల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

ఎవరేంటనేది ప్రజలకు బాగా తెలుసు
► వెనక నుంచి కుట్రలు చేసి, ముందుకొచ్చి గగ్గోలు పెట్టేది ఎవరనేది ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్లు సంక్షేమంపై ఖర్చు చేస్తే.. అందులో సింహభాగం లబ్ధిదారులు హిందువులే. సీఎం జగన్‌ను ప్రజల గుండెల్లో నుంచి తీసేయలేరు. కాబట్టే నీచ, నికృష్ట కార్యక్రమాలకు చంద్రబాబు పాల్పడుతున్నారు. 
► దేవాలయానికి బూట్లు వేసుకుని వెళ్లే వ్యక్తి, బూట్లు వేసుకుని హారతి తీసుకునే వ్యక్తి ఎవరో ప్రజలకు తెలుసు. దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చరిత్ర, విజయవాడలో 40 గుడులను కూల్చేసిన చరిత్ర బాబుదే.
► సీఎం జగన్‌కు అన్ని మతాల పట్ల విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం ఉండబట్టే.. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కోట్ల మందికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ సీఎంల జాబితాలో జగన్‌ మూడో స్థానంలో నిలిచారు.  

మరిన్ని వార్తలు