చంద్రబాబుకు మంత్రి అనిల్‌ కుమార్‌ సవాల్‌

3 Aug, 2020 16:21 IST|Sakshi

అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

సాక్షి, తాడేపల్లి : అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. ప్రభుత్వం నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు 23మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లమని సూచించారు. చంద్రబాబు ఇప్పటికైనా కపట నాటకాలు మానుకోవాలని మంత్రి అనిల్‌ కుమార్‌ హితవు పలికారు. 

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయి. అమరావతిని ఎక్కడ రాజధానిగా తీసేయలేదు. అదనంగా మరొ రెండు రాజధానులు వస్తున్నాయి. అభివృద్ధి కోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. (11 మందితో ఏఎంఆర్డీఏ)

రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు ఇంత గగ్గోలు పెట్టలేదు. బినామీలు నష్టపోతారని ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్‌లో కట్టుకోలేదు. ఇక్కడ అక్రమ కట్టడంలో తలదాచుకుంటున్నారు. ఆయన ఐదు నెలల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రాజధానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడ నుంచి తేవాలి ఆ లక్ష కోట్ల రూపాయిలు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ భూమిని రాజధానిగా పెట్టాలని అసెంబ్లీలో చెప్పారు. ఆయన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంత రాద్ధాంతం చేయలేదు. ఇక పవన్ కల్యాణ్ ఎప్పుడు కన్ఫ్యూజన్‌లో ఉంటారు. ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఎవరికి తెలియదు. పవన్‌ గురించి మాట్లాడటం అనవసరం. ఒకసారి బీజేపీ అంటారు, ఇంకోసారి టీడీపీ అంటారు. బీటెక్‌ రవి రాజీనామా వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన స్ఫూర్తితో టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం)

మరిన్ని వార్తలు