టీడీపీ అంపశయ్యపై నుంచి చితిలో పడింది

22 Feb, 2021 17:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: భారతదేశ చరిత్రలోనే ఓడిపోతే సంబరాలు చేసుకునేది ఒక్క టీడీపీ మాత్రమేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. 81 శాతం స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధిస్తే కేవలం 16 శాతం సాధించిన టీడీపీ సంబరాలు జరుపుకోవడం ఏంటని విమర్శించారు. పైగా ప్రతి విడతలో టీడీపీ పుంజుకుంది అని బాబు చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన వల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు తమకు విజయాన్ని అందించారన్నారు. టీడీపీకి వచ్చిన 16 శాతం కూడా వైఎస్సార్‌సీపీ రెబల్స్ వల్ల వచ్చిందని, లేదంటే సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 41 శాతం స్థానాలు గెలిచామని బాబు అభూత కల్పన చేస్తున్నారని, దమ్ముంటే ఏ జిల్లాలోనైనా మీ వాళ్లకు కండువా వేసి చూపించగలవా? అని సూటిగా ప్రశ్నించారు. 

క్షుద్రపూజలు చేయించింది నువ్వు..
"చంద్రగిరిలో 104 వైఎస్సార్‌సీపీ గెలిస్తే, 4 టీడీపీ గెలిచింది. నారావారిపల్లెలో కేవలం 8 వార్డులు గెలిచి సంబరాలు చేసుకున్నారు. నీ సొంత ఇలాకాలోనే 20 శాతం సాధించలేని నువ్వు 41 శాతం గెలిచావా..? సర్పంచ్ ఎన్నికలకు 25 ప్రెస్ మీట్‌లు పెట్టిన ఘనుడు చంద్రబాబు. వైఎస్సార్‌సీపీ పతనం అయ్యిందా...? ఎక్కడో చూపించు. కుప్పంలోనే దిక్కు లేదు, అలాంటిది మరో 10శాతం అదనంగా వచ్చేవి అనడానికి సిగ్గులేదా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి. టీడీపీ అంపశయ్యపై నుంచి చితిలో పడిపోయింది. ఏ దిక్కు లేక స్వరూపానందపై పడ్డాడు...క్షుద్రపూజలు అంటాడు. క్షుద్రపూజలపై పేటెంట్ ఒక్క చంద్రబాబుకే ఉంది. దుర్గగుడి, కాళహస్తిలో నీ కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించింది నువ్వు. కేపిటల్ జోన్ అంటున్న తాటికొండలో కూడా మేము 70 శాతం గెలుచుకున్నాం. ప్రజలు 81 శాతం సీట్లు ఇచ్చి సీఎం జగన్‌పై నమ్మకాన్ని ఉంచారు. అందుకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇక బూతుల్లో గెలిచి సంబరాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారుతుంది. ఈ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరాడని ప్రజలు తీర్పిచ్చారు."

చంద్రబాబుకు ఆ అర్హత లేదు
"మేము అధికారంలో ఉండటానికి అర్హత లేదని చెప్పే అర్హత చంద్రబాబుకు అసలే లేదు. ఓ పక్క నువ్వు పెట్టిన నిమ్మగడ్డ అంతా బాగా జరిగిందని అంటే నువ్వేమో రావణకాష్టం అంటావు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. అయినా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఉంది చంద్రబాబు తీరు. వాళ్ళు గెలిచిన 16 శాతం చోట్లలో ఎన్నికలు బాగా జరిగినట్లా? 81శాతం గెలిచిన చోట ఎన్నికలు బాగా జరగలేదా? కౌంటింగ్ కేంద్రాల వద్ద కరెంట్ తీయడం కాదు, వాళ్ల కరెంట్ కట్ అయ్యింది ఇంకా చంద్రబాబు ఆలాంటి గొప్ప వారసుడిని పెట్టుకుని అధికారంలోకి వస్తాను అనడం పగటికల. 2024లో కూడా మా ముఖ్యమంత్రి కూల్‌గా ఆ సీట్లో కూర్చుంటారు" అని మంత్రి అనిల్‌ కుమార్‌ కరాఖండిగా చెప్పారు.

చదవండి: ‘మా నాయకుడు కుప్పంలో చుక్కలు చూపించారు’

నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..!

మరిన్ని వార్తలు