పవన్‌కు ఎందుకంత భయం: మంత్రి అనిల్‌

26 Sep, 2021 12:46 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: పవన్ కల్యాణ్ నటించినా, మరే ఇతర నటుడు నటించినా కష్టం అనేది ఒకటే అని మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని తెలిపారు. ఆన్‌లైన్‌ పోర్టల్ అంటే ఎందుకంత భయమని సూటిగా ప్రశ్నించారు.

దాని వల్ల జరిగే నష్టం ఏమిటని నిలదీశారు. రాజకీయ ఉనికి కోసమే పవన్‌ తాపత్రయ పడుతున్నాడని మండిపడ్డారు. తన ఒక్కడి కోసం చిత్రసీమను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కల్యాణ్ మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. ఇది పవన్ కల్యాణ్ క్రియేషన్ అని, చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం జగన్‌ను తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జడ్పీటీసీలు, ఎంపీటీసీకే తన అడుగులు అంటున్నాడు, స్థానాలు పెరిగే లోపల పార్టీనే చాపచుట్టేయడం ఖాయమన్నారు. పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ పోర్టల్ అని, అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు.

వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్‌కు ఎందుకు?
సాక్షి, విజయనగరం: సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని అన్నారు. సినిమ టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారని తెలిపారు. వాళ్లకు లేని బాధ పవన్ కల్యాణ్‌కి ఎందుకు అని ప్రశ్నించారు. నోరు ఉందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

మరిన్ని వార్తలు